Cabinet Reshuffle in Telangana: తెలంగాణలో త్వరలో మంత్రివర్గ మార్పు జరుగబోతుందా అంటే అవుననే సమాధానం గులాబీ నేతల నుంచి వినిపిస్తోంది. ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో కేబినెట్‌లో ఒక పోస్టు ఖాళీగా ఉంది. దీంతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు సలహాదారుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే మూడునాలుగు సార్లు తన టీంతో సర్వే చేయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై గులాబీ బాస్‌కు నివేదిక కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ మార్పు చేయాలని, వచ్చే ఎన్నికల్లో కొంతమందికి టికెట్ ఇవ్వకూడదని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలలో వీలైనంత త్వరగా మంత్రివర్గ మార్పు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అందుకోసమే రాజ్‌భవన్‌లో ఎంట్రీ..
గవర్నర్‌తో దాదాపు ఏడాదికాలంగా గ్యాప్ ఉన్న సీఎం కేసీఆర్ మంత్రివర్గ మార్పు చేయాలంటే ముందు గవర్నర్‌ను కలవాలి. ఎలా కలవాలని ఆలోచన చేస్తున్న క్రమంలో తాను సొంతంగా వెళ్లడం కంటే రాజభవన్ నుంచి ఆహ్వానం వస్తే వెళ్లాలని కేసీఆర్ ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిని సుప్రీం కోర్టు నియమించింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. కేసీఆర్ దేనికోసం ఎదురు చూస్తున్నారో.. అదే జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్‌భవన్ నుంచి ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం అందింది. ఇదే అవకాశంగా భావించిన కేసీఆర్ ఎలాంటి లీసుకులు, సాకులు చెప్పకుండా వెంటనే రాజ్‌భవన్‌లో వాలిపోయారు. గవర్ననర్‌ను మొదట కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. కాసేపు మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నట్లుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసే వరకూ వ్యవహరించారు.
Also Read: CM KCR Visits Raj Bhavan: కేసీఆర్ కాంప్రమైజ్.. రాజ్‌భన్‌కు వచ్చిన సీఎం.. తమిళిసైతో మాటామంతి!
ప్రధాని బస నేపథ్యంలోనూ…
బీజేపీ జాతీయ కార్యయవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో రెండు రోజులు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు రానున్నారు. జూలై 2, 3వ తేదీల్లో ఆయన రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉండడంతో కేసీఆర్ గవర్నర్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అతిత్వరలో మళ్లీ రాజ్‌భవన్‌కు కేసీఆర్!
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం సందర్భంగా 9 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు వచ్చిన కేసీఆర్ అతిత్వరలోనే మరోమారు రాజ్‌భవన్‌కు వస్తారని తెలుస్తోంది. పీకే నివేదిక ప్రకారం మంత్రివర్గంలో మార్పు చేయాలని యోచిస్తున్న కేసీఆర్ త్వరలోనే గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరతారని పోలిటికల్ టాక్. ఇప్పటికే పీకే చెప్పినట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో కొంత మంది ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోవచ్చన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రివర్గ మార్పు చేపడతారన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే సంచలన రాజకీయాలు చేసే కేసీఆర్ ఏ నిర్ణయం తీసకుంటారో వేచి చూడాలి.