దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై జరిగిన రణం ఎంత మారణహోమాన్ని సృష్టించిందో కళ్లారా చూశాం. బీజేపీ సీఏఏ చట్టాన్ని కొన్ని వర్గాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఇప్పుడు రెచ్చగొట్టి ఇంతటి దారుణానికి కారణమైన వారిపై చర్యలకు ఉప క్రమించి వారికి షాకిచ్చింది.
Also Read: క్షమాపణ కోరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
కేంద్రంలోని బీజేపీతో ఫైట్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేరు చార్జిషీట్ లో చేర్చడం సంచలనమైంది. ఈయనతోపాటు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ,సీపీఐఎంఎల్ పొలిట్ బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్, విద్యార్థి నేత కవల్ ప్రీత్ కౌర్, శాస్త్రవేత్త గౌహర్ రాజా తదితరుల పేర్లను ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ లో చేర్చారు.
ఇక తన పేరును ఢిల్లీ అల్లర్ల చార్జిషీట్ లో చేర్చడంపై బృందాకారత్ మండిపడ్డారు. అది ‘చార్జిషీట్ కాదని.. చీట్ షీట్ ’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి కనుసన్నల్లోనే తమపై ఇలా కేసులు పెడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
ఇక మత ఘర్షణలకు కారణమైన కపిల్ శర్మ వంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని చార్జిషీట్ లో సామాజిక కార్యకర్తలుగా పేర్కొంటున్నారని తెలిపారు. సీఏఏను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం ఏంటని బృందాకారత్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించలేదు.
Also Read: స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు ఢిల్లీలో మారణహోమాన్ని సృష్టించాయి. ఈ మత కల్లోలాల్లో ఏకంగా 50మందికి పైగా అసువులు బాసారు. ఈ కేసులో ఇప్పటికే సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, జేఎన్యూ నాయకుడి పేర్లను చార్జిషీట్ లో చేర్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వీరు చేసిన ప్రసంగాలే ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యాయంటూ చార్జిషీట్ దాఖలు చేశారు.