Byreddy Siddharth Reddy: ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఒక వార్త సరికొత్తగా సర్క్యూలేట్ అవుతోంది. ఏపీ శాప్ చైర్మన్, వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారన్న వార్త తెగ వైరల్ అవుతోంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతం జగన్ కు హార్ట్ కోర్ ఫ్యాన్. సోషల్ మీడియాలో పొలిటికల్ క్రేజీ ఉన్న యంగ్ లీడర్. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పై రకరకాల రూమర్లు వచ్చాయి. దీంతో వైసీపీ హైకమాండ్ జాగ్రత్త పడింది. క్యాబినెట్ హోదాతో సమానమైన శాప్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయినా సిద్ధార్థ్ రెడ్డి ఏమంత కంఫర్టుగా లేరు. దీంతో ఆయన వైసీపీని వీడుతారని జోరుగా ప్రచారం సాగింది. దానిని ఆయన ఖండిస్తూ వచ్చారు.

కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కాలం ఆ కుటుంబం టీడీపీ వెంట నడిచింది. నందికొట్కూరు కేంద్రంగా రాజకీయాలు నడిపారు. కుటుంబసభ్యులు ఎన్నో పదవులు చేపట్టారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులు బైరెడ్డి కుటుంబంలో రాజకీయ చీలిక తెచ్చాయి. దీంతో జగన్ గూటికి సిద్ధార్థ్ రెడ్డి చేరారు. అయితే నందికొట్కూరు రిజర్వ్ నియోజకవర్గం కావడంతో సిద్ధార్థ్ రెడ్డి పోటీచేయడానికి వీలుపడలేదు. అయినా అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపునకు కృషిచేశారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన అర్ధర్ తో బైరెడ్డికి విభేదాలు పొడచూపాయి. అయితే హైకామాండ్ మాత్రం ఇరువర్నీ సర్దిచెబుతూ వస్తోంది. అయితే అక్కడ జగన్ ఫొటోతో గెలిచానని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం.. హైకమాండ్ పెద్దలు ఆయనకే మద్దతు తెలపడంతో సిద్ధార్థరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అందుకే పార్టీ మారాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.
అయితే అందుకు పూర్వాశ్రమం టీడీపీ అయితే సేఫ్ జోన్ గా భావించారు. నందికొట్కూరుతో పాటు మరో రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తే టీడీపీలో చేరతానని షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లతో ఫోన్లో చర్చించినట్టు కూడా ప్రచారం సాగింది. అయితే ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన జగన్ తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తూ ఏపీ శాప్ చైర్మన్ పోస్టును సిద్ధార్థరెడ్డి కట్టబెట్టి తాత్కాలికంగా నిలువరించగలిగారు. అటు తరువాత సిద్ధార్థరెడ్డి పార్టీ మారతారన్న ప్రచారానికి కాస్తా ఫుల్ స్టాప్ పడింది.

ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ తో సిద్ధార్థరెడ్డి భేటీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ఇది జగన్ కు కలవరపాటుకు గురిచేస్తోంది. వాస్తవానికి సిద్ధార్థరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయాలని భావిస్తున్నారు. కానీ నందికొట్కూరు రిజర్వు స్థానం కావడం, వైసీపీలో బెర్తులు ఖాళీలు లేకపోవడంతో సిద్ధార్థరెడ్డి ఆశ తీరకపోతోంది. దీంతో ఆయన తన నాయకత్వాన్ని గౌరవించి, స్వేచ్ఛనిచ్చే పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇలా చూసుకుంటే టీడీపీ కంటే జనసేన బేటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే పవన్ తో సమావేశమై కొన్ని షరతులు ఆయన ముందుపెట్టారు. ప్రస్తుతం క్యాబినెట్ హోదా పదవి చేతిలో ఉంది కాబట్టి.. ఎన్నికలకు ముందు సిద్ధార్థరెడ్డి జనసేన గూటికి చేరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.