Byreddy Rajasekhar Reddy: సీనియర్ నాయకుడు, రాయలసీమలోని కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన టిడిపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి కుటుంబానిది ప్రత్యేక స్థానం. రాజశేఖర్ రెడ్డి కి రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పూర్వశ్రమం సైతం తెలుగుదేశం పార్టీయే. అందుకే అనూహ్య పరిణామాల నడుమ ఆయన టిడిపి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో బైరెడ్డి పాణ్యం నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. అక్కడ తన చిరకాల ప్రత్యర్థి గౌరు చరితారెడ్డి పై తలపడ్డారు. 2012లో తెలుగుదేశం పార్టీని వీడారు. ప్రత్యేక రాయలసీమ గళాన్ని అందుకున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయినా పోటీ చేసేందుకు టికెట్ దక్కలేదు. కానీ గౌరు వెంకటరెడ్డితో కలిసి పని చేశారు. టిడిపికి ఓటమి ఎదురు కావడంతో.. కుమార్తె శబరితో కలిసి బిజెపిలో చేరారు. అయితే కొంతకాలంగా రాయలసీమ వెనుకబాటు తనంపై పోరాడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేస్తున్నారు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన చేరిక వాయిదా పడింది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి టిడిపిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన టిడిపిలో చేరితే కర్నూలు జిల్లా రాజకీయాల్లో మార్పు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే రాయలసీమలో కీలక నేతగా ఉన్న బైరెడ్డి టిడిపిలో చేరుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.