CM Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ పాలన వ్యవహారాలను విశాఖ కేంద్రంగా నిర్వహించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న విశాఖ రాజధాని తరలింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. క్యాబినెట్ బేటిలో మంత్రులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది దసరా పండుగను విశాఖలోనే జరుపుకుంటానని స్పష్టం చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన విషయం విదితమే. అయితే చట్టపరంగా ఎదురైన ఇబ్బందులను అధిగమించలేక… ఇంతవరకు మూడు రాజధానుల అంశంపై ముందడుగు వేయలేకపోయారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్న విమర్శ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో విశాఖ నుంచి పాలన సాగిస్తే ప్రజలకు కొంతవరకు సంతృప్తి పరచవచ్చన్న కోణంలో జగన్ ఆలోచిస్తున్నారు. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించి.. ఇక్కడ నుంచే పాలన సాగించేలా చూడాలని భావిస్తున్నారు. అందుకు దసరాను ముహూర్తంగా నిర్ణయించారు. బుధవారం క్యాబినెట్ భేటీలో సహచర మంత్రులకు పూర్తి స్పష్టతనిచ్చారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పాలనను ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు.
రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తీర్పు ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లు భావిస్తున్నారు. డిసెంబర్ లో విచారణకు వచ్చే అవకాశం ఉన్నా.. తుది తీర్పు వెలువడే అవకాశం లేదు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా భావిస్తున్నారు. అటు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా.. సుప్రీంకోర్టులో అనుకూల, వ్యతిరేక తీర్పులు వచ్చినా ప్రభుత్వపరంగా చేసేదేమీ లేదు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలు తట్టుకోవాలంటే.. విశాఖ నుంచి పాలన సాగించడమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. విజయదశమి నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ సహచరులకు చెప్పారు.