Pawan Kalyan Bus Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దసరా నుంచి ఏపీలో బస్సు యాత్ర చేపట్టడం సంచలనమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 175 నియోజకవర్గాలను చుట్టేసేలా ఆయన సడెన్ గా ఈ టూర్ పెట్టుకున్నాడు. దీని కోసం కొత్తగా 8 స్కార్పియోలను కూడా కాన్వాయ్ కోసం కొనుగోలు చేశారు.

ఏపీలో ముందస్తు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీ ‘గడపగడపకు ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను పంపింది. దీనికి పోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘బాదుడే బాదుడే’ అంటూ వైసీపీ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇక బీజేపీ ‘గోదావరి గర్జన’ పేరుతో రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించి ఊపు తీసుకొచ్చింది.
ఈ ముగ్గురు యాక్టివ్ పాలిటిక్స్ తో ముందస్తు ఎన్నికలకు ముందే సై అంటుండడంతో ఇక పవన్ కళ్యాణ్ సైతం తన సినిమా షూటింగ్ లను ఈ ఐదు నెలల్లో పూర్తి చేసి అక్టోబర్ 5 నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రకు కారణం ముందస్తు ఎన్నికలకన్నా మరేదో కారణం అయ్యి ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లపై అటు చంద్రబాబు అండ్ టీడీపీ స్పందించడం లేదు. అసలు మహానాడు తెచ్చిన ఊపుతో పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని అంతర్గతంగా టీడీపీలో ఆదేశాలు జారీ అయ్యాయట.. దీంతో జనసేనను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఇక బీజేపీ సైతం ఇటీవలే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మాటమార్చి పవన్ కళ్యాణ్ కు షాకిచ్చింది.
అందుకే పవన్ కళ్యాణ్ ఇక ఒంటరిగానే ఏపీ ఎన్నికల బరిలోకి దూకుతున్నాడు. తన స్టామినా ఏంటో చూపించి జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో జనసేనకు ఆదరణ తీసుకురావడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టారు. తద్వారా జనసేన ఓటు బ్యాంకును పెంచడానికి డిసైడ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన బలం నిరూపించి ప్రత్యర్థులనే తన కాళ్ల దగ్గరకు తీసుకొచ్చేలా చేయడానికే ఈ బస్సు యాత్ర చేపట్టినట్టు తెలుస్తోంది.బీజేపీ, టీడీపీల వ్యవహారశైలి కారణంగానే పవన్ కళ్యాణ్ తనేంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. మరి జనసేనాని తన బలాన్ని ఎంతవరకూ పెంచుకుంటాడో వేచిచూడాలి.