
రాష్ట్రంలోని రోడ్లపై ఆర్టీసీ బస్సులు పరుగులు ప్రారంభించాయి. లాక్‌డౌన్ కారణంగా గత రెండునెలలుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు గురువారం ఉదయం 7 గంటల నుంచి సంస్థ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్ నిన్న సాయంత్రం నుంచే మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు (17 శాతం) నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12 వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1,683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచే యోచనలో అధికారులు ఉన్నారు.
ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. ప్రస్తుతానికి బస్టాండ్ల మధ్య మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తున్నారు. ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే బస్సులోకి అనుమతిస్తున్నారు. అన్ని బస్టాండ్లలోనూ కరెంట్ బుకింగ్ సదుపాయం కల్పించారు. కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్ నంబరు నమోదు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా మాస్కులు వినియోగించాల్సి ఉంది.
దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల కంటే ముందే బస్టాండ్లకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడని సూచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికులకు అందరినీ పరీక్షించి బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించడం లేదు.