2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో షాకుల మీద షాకులే ఇచ్చారు. ఓ వైపు ప్రభుత్వ సంస్థలకు మంగళం పాడుతూనే.. బీజేపీ సర్కార్ ప్రైవేటీకరణను అందలం ఎక్కించింది. పలు సంస్థల్లో భారీ స్థాయిలో పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, ఎస్సీఐ, సీసీఐ, హెచ్‌పీసీఎల్, ఐడీబీఐ, బీఈఎంఎల్ సంస్థల ప్రైవేటీకరణపై ప్రకటన చేశారు.
Also Read: పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ
ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాదిలో ఎల్ఐసీ ఐపీవోను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మూలధన సహాయం కింద ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బడ్జెట్ 2021-22 రౌండప్: ముఖ్యాంశాలు.. పెరిగేవి.. తగ్గేవి ఇవీ
మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. బీమా రంగంలో 75 శాతం వరకు ఎఫ్‌డీఐలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ జనాభా లెక్కింపు కోసం రూ.3,726 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్ పై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరుకోవాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బలమైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. దానికోసం అభివృద్ధితోపాటు సంస్కరణలు కూడా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖమంత్రి తెలిపారు. జాతీయస్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ పర్యవేక్షణకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటుచేస్తున్నామన్నారు.