BSNL
BSNL : ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు తక్కువగా ఉండటంతో, అనేక మంది వినియోగదారులు BSNL సేవలను ఎంచుకుంటున్నారు. అయితే, సిగ్నల్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, BSNL నెట్‌వర్క్ విస్తరణపై కీలక ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. BSNL దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. 2024 అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్లను, 2025 మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
BSNL 4G నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త టవర్లను ఇన్‌స్టాల్ చేస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు కొనసాగుతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణాలు స్పెక్ట్రమ్ కేటాయింపు , స్మార్ట్‌ఫోన్ అనుకూలత. BSNL 4G నెట్‌వర్క్ 700MHz బ్యాండ్‌ను ఉపయోగిస్తోంది..కానీ పాత స్మార్ట్‌ఫోన్‌లు ఈ బ్యాండ్‌ను సపోర్ట్ చేయకపోవచ్చు. దీంతో వినియోగదారులు సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు, టెలికాం శాఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ పరికరాలు 700MHz బ్యాండ్‌కు సపోర్టు ఇవ్వాలని సూచించింది. అదనంగా, ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ICR) సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో, ఒక నెట్‌వర్క్‌కు సంబంధించిన టవర్ అందుబాటులో లేకపోయినా, ఇతర నెట్‌వర్క్‌ల 4G టవర్లను ఉపయోగించి కాల్స్ చేయవచ్చు. ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. ఈ ఫీచర్ డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా ఏర్పాటైన 4G టవర్ల పరిధిలో అందుబాటులో ఉంటుంది.
BSNL నెట్‌వర్క్ విస్తరణ, సిగ్నల్ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలతో, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లు 700MHz బ్యాండ్‌ను సపోర్ట్ చేస్తున్నాయా అని తనిఖీ చేసుకోవడం, అవసరమైతే పరికరాలను అప్‌గ్రేడ్ చేయడం మంచిది.