Jammu And Kashmir: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. పైగా భారత్ మీద దాడులు చేయడానికి రకరకాల ప్రణాళికలను రూపొందిస్తున్నారు.. ఇటీవల ఢిల్లీలో బాంబు పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులు.. జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్ర కుట్రకు ప్రణాళిక రూపొందించారు. ఈ కుట్రను భద్రతా దళాలు చేదించాయి.
జమ్ము కాశ్మీర్ లోని ఆకునూరు సెక్టార్లో శుక్రవారం నాడు ఏకే రైఫిల్ ధరించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదిని సరిహద్దు భద్రత దళం పట్టుకుంది. సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించడానికి అతడు ప్రయత్నిస్తుండగా భద్రతాదళం అతడిని అరెస్ట్ చేసింది. రాజౌరి జిల్లాలోని బుధాల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాలిక్.. పూంచ్, రాజౌరి ప్రాంతాలలో ఉగ్రవాద సంస్థకు ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితమే ఖాలిక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పాకిస్తాన్ చేరుకున్న అతడు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. భారత్ అంటే చాలు కసి తో రగిలి పోయేవాడు. అక్కడ శిక్షణ పొందిన అతడు సరిహద్దులో భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా బిఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత అతనిని పోలీసులకు అప్పగించారు.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ స్థానికులను ఉగ్రవాద సంస్థలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఢిల్లీ ఘటనతో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. అంతేకాదు వారందరినీ కూడా పాకిస్తాన్ పంపించి.. అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకునేలా చేసి.. ఆ తర్వాత సరిహద్దుల్లో ఆక్రమంగా మన దేశంలోకి పంపించడానికి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.. ఆపరేషన్ సిందూర్ తర్వాత సాంబ, కథువా, జమ్ము సెక్టార్లకు ఎదురుగా ఉన్న సియాల్కోట్, జఫర్వాల్ ప్రాంతాలలో పాకిస్తాన్ 17 లాంచ్ ప్యాడ్ లను పునరుద్ధరించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో భద్రత బలాలు అప్రమత్తమయ్యాయి. ఈ లాంచ్ ప్యాడ్ లను పునరుద్ధరించిన కొద్ది రోజులకే భారతదేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాది ప్రయత్నించడం విశేషం. అయితే ఆ ఉగ్రవాది మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది.
మనదేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వారి పేదరికాన్ని లక్ష్యంగా చేసుకొని.. ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఆ తర్వాత వారిని శిక్షణ నిమిత్తం పాకిస్థాన్ తరలించి.. ఆ తర్వాత మనదేశంలోకి అక్రమ మార్గంలో ప్రవేశించేలా చేస్తున్నాయి. ఆ తర్వాత మనదేశంలో అల్లకల్లోలం జరగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది మనదేశంలోకి ప్రవేశిస్తూ దొరికిపోయిన నేపథ్యంలో.. భద్రతా దళాలు సరిహద్దుల్లో మరింత పటిష్టంగా పహారా కాస్తున్నాయి.