BRS Win In Maharashtra: భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసి బొక్కా బోర్లా పడిన భారత రాష్ట్ర సమితికి ఇక మహారాష్ట్రలో అంత సీన్ లేదు అనుకుంటున్న తరుణంలో శుభవార్త దక్కింది.. మహారాష్ట్రలో ఒక గ్రామ పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి సర్పంచ్ గా తొలి విజయాన్ని అందించాడు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఉప ఎన్నికల్లో తన ప్రత్యర్థి పై 115 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ” ఇది తొలి విజయం మాత్రమే కాదు. రాబోయే ఎన్నికల కోసం ఉత్సాహంగా పనిచేసేందుకు దోహదపడుతుందని” భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంబేలోహల్ గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గఫార్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పై విజయం సాధించారు. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు చెందిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు నాందేడ్ లో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగానే సర్పంచ్ గా గెలవడం పట్ల భారత రాష్ట్ర సమితి హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇది ఒక శుభ పరిణామం అని, త్వరలో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో అన్నిచోట్ల ఇదే ఫలితం కనిపిస్తుందని భారత రాష్ట్ర సమితి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికలకు మరికొంత సమయం ఉండడంతో
దేశవ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేయాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత ముందుగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించాలి అనుకున్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే విశాఖ ఉక్కు కర్మగారం ఆసక్తి వ్యక్తి కరణ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే దానిని సింగరేణి స్వీకరిస్తుందని ప్రకటన చేసిన కేసీఆర్.. తర్వాత ఎందుకనో వెనుకడుగు వేశారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీగా అడుగుపెట్టడం సాధ్యం కాదని భావించిన ఆయన.. తర్వాత తన దృష్టిని మహారాష్ట్ర వైపు మళ్ళించారు. అక్కడ ఇప్పటికే మూడు చోట్ల సభలు నిర్వహించారు. భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బోర్లా పడ్డారు. అయితే తొలి అడుగుకే అపజయం ఎదురు కావడంతో.. ఈసారి మరింత బలంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే శరత్ మార్ఖడ్ అనే వ్యక్తిని తన ప్రైవేట్ సెక్రటరీగా నియమించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి జీతం చెల్లిస్తూ, కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కెసిఆర్ వెనుకడుగు వేయలేదు. ఇక నాందేడ్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత, శిక్షణ తరగతులు మొదలుపెట్టారు. ఉప ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నది.
BRS National President and Hon’ble Chief Minister Sri K Chandrashekhar Rao inaugurated BRS training camp in Nanded, Maharashtra today. pic.twitter.com/b9jZj0N3Jj
— BRS Party (@BRSparty) May 19, 2023