BRS Office In AP: ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నో ఆశలతో పార్టీలో చేర్పించుకున్న కేసీఆర్ తరువాత మీ పాట్లు మీరు పడండంటూ నేతలను విడిచిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేరిన ఒకరిద్దరు నేతలు సైతం డీలా పడుతున్నారు. మొన్న ఆ మధ్యన జనసేనలో ఉన్న తోట చంద్రశేఖర్ ను పార్టీలోకి రప్పించి ఏపీ బాధ్యతలను అప్పగించారు. నీకెందుకు ప్రగతిభవన్ కంటే ఏపీ ఆఫీసు నేతలతో కిటకిటలాడిపోతుందంటూ నమ్మబలికారు. దీంతో పార్టీలో చేరిన చంద్రశేఖర్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ చివరకు ఏపీలో కార్యాలయ ప్రారంభాన్ని సైతం కేసీఆర్ డుమ్మా కొట్టేశారు. దీంతో తనకు తానే కార్యలయం ప్రారంభించునుకున్నారు తోట చంద్రశేఖర్.
జనసేనలో ఉంటే మంచి నాయకుడిగా చంద్రశేఖర్ కి గుర్తింపు ఉండేది. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎక్కడో ఓ చోట ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో పోటీచేసే చాన్స్ దక్కేది. కానీ ఏకంగా రాష్ట్ర నాయకుడిని అయిపోదామన్న రీతిలో బీఆర్ఎస్ లో చేరారు. మంచి భవిష్యత్ ఉంటుందని అంచనా వేశారు. ఏపీలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. విశాఖలో కార్యాలయమంటూ హడావుడి చేశారు. విశాఖ స్టీల్ఇష్యూతో రాజకీయం చేయాలని చూశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. దీంతో సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. గుట్టుగా గుంటూరు పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవాల్సి వచ్చింది.
అయితే ఇలా చేరిన వారందరికీ హైదరాబాద్ అవసరాలను కేసీఆర్ ఎరగా వేసినట్టు ప్రచారం జరిగింది. అందులో భాగంగా తోట చంద్రశేఖర్ కు ఏకంగా నాలుగు ఎకరాలు ఇచ్చినట్టు టాక్ నడిచింది. అందుకే ఆయన బీఆర్ఎస్ లో చేరారని.. తీరా చేరాక అక్కడే చచ్చినట్టు ఉండాల్సి వచ్చిందని ఆ మధ్యన కామెంట్స్ వినిపించాయి. అయితే ఒడిశాలోనూ సేమ్ డిటో. అప్పుడెప్పుడో ఒడిశాకు అనూహ్యంగా సీఎం పదవి దక్కించుకున్న గిరిధర్ గోమాంగో తరువాత ఫేడ్ అవుట్ అయినా నాయకుడిగా మిగిలిపోయారు. ఆయన్ను ఒడిశాకు బీఆర్ఎస్ ఇన్ చార్జిగా ప్రకటించారు. కనీసం అక్కడ కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించలేదు. తోట చంద్రశేఖర్ మాదిరిగా సొంతంగా పార్టీ కార్యాలయం ప్రారంభించే సాహసం గిరిధర్ గొమాంగో చేయడం లేదు.