BRS: విరాళాల్లో బీఆర్ఎస్ నే తోపు.. ఇప్పటికీ ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?

2022–23 ఏడాదికి గాను దేశంలోని వివిధ పార్టీలు సమర్పించిన యాన్యువల్‌ ఆడిట్‌ అకౌంట్స్, విరాళాలు, ఆదాయంలో వచ్చిన మార్పుల వివరాలను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తన వెబ్‌సైట్‌లో అప్‌ డేట్‌ చేసింది.

Written By: Raj Shekar, Updated On : November 24, 2023 12:32 pm

Telangana Elections 2023

Follow us on

BRS: తెలంగాణ అధికార పార్టీ ఆదాయంలో మరోసారి టాప్‌లో నిలిచింది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆదాయం సమకూర్చుకోవడంలో దేశంలో ఏ పార్టీకి లేనంతగా సొమ్ములు పోగేసుకుంటోంది. 2022–2023కు గాను దేశంలోనే అత్యధికంగా రూ. 683 కోట్ల 6 లక్షల 70 వేల 500 నిధులను బీఆర్‌ఎస్‌ సమకూర్చుకుంది. ఇందులో వ్యక్తులు, కంపెనీలు, సంస్థల నుంచి(రూ.20,000 కంటే ఎక్కువ చొప్పున) వచ్చిన విరాళాలు రూ.64 కోట్ల 3 లక్షల 500 మేరకు ఉండగా.. ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ఫండ్స్‌ రూపంలో రూ.90 కోట్లు.. ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో రూ.529 కోట్ల 3 లక్షల 70 వేలు పార్టీ అకౌంట్‌ లో క్రెడిట్‌ అయింది.

వివరాలు వెల్లడించిన ఈసీ..
2022–23 ఏడాదికి గాను దేశంలోని వివిధ పార్టీలు సమర్పించిన యాన్యువల్‌ ఆడిట్‌ అకౌంట్స్, విరాళాలు, ఆదాయంలో వచ్చిన మార్పుల వివరాలను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తన వెబ్‌సైట్‌లో అప్‌ డేట్‌ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న బీఆర్‌ఎస్‌ తరపున ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి ఈ రిపోర్ట్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఈ రిపోర్ట్‌లో ఏడాది కాలంలో పార్టీ సమకూర్చుకున్న ఆదాయ వివరాలను అటాచ్‌ చేశారు. చెక్కుల రూపంలో, ఇతర మార్గాల్లో పార్టీకి వచ్చిన విరాళాలను పొందుపర్చారు.

రెండోస్థానంలో డీఎంకే..
దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో బీఆర్‌ఎస్‌ టాప్‌ లో నిలవగా, ఆ తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ రెండో ప్లేస్‌ లో నిలిచింది. అయితే, బీఆర్‌ఎస్‌తో పోల్చితే చాలా తక్కువ మొత్తంలో రూ.192.22 కోట్లు మాత్రమే ఈ పార్టీకి సమకూరాయి. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సాఆర్‌ సీపీ రూ.68 కోట్లు విరాళంగా అందుకుంది. టీడీపీకి కేవలం వ్యక్తులు, సంస్థల నుంచి రూ.11 కోట్ల 92 లక్షల 39 వేల124 మాత్రమే విరాళాలు అందాయి. తృణæమూల్‌ కాంగ్రెస్‌ కు రూ. 2 కోట్లు, ఎంఐఎంకు రూ. 24 లక్షల 9 వేలు విరాళంగా అందినట్లు వెల్లడించింది.

బీఆర్‌ఎస్‌కు పార్టీ నేతల నుంచే..
బీఆర్‌ఎస్‌ కు విరాళాల రూపంలో దక్కిన రూ.64.03 కోట్లలో ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులు ఇచ్చినవే ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల రూ.10 కోట్లతో టాప్‌లో నిలిచారు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.5 కోట్ల చొప్పున రెండు విడతలుగా ఈ నిధులు చెక్కుల రూపంలో ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబానికి చెందిన గాయత్రి గ్రానైట్‌ సంస్థ రూ. 10 కోట్లు, మంత్రి మల్లారెడ్డి రూ.2.75 కోట్లు, మల్లారెడ్డి సతీమణి కల్పన పేరిట రూ.2.25 కోట్లు విరాళంగా అందాయి. ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డి బంధువులకు చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్‌ రూ. 10 కోట్లు ఇచ్చినట్లు ఇచ్చింది. వేములవాడ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న చల్మెడ నరసింహారావు ఫ్యామిలీకి చెందిన చల్మెడ ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ రూ.2 కోట్లు, విమలా ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ. 4 కోట్లు బీఆర్‌ఎస్కు అందాయి. రోషిణి మినరల్స్‌ నుంచి రూ.5 కోట్లు, హన్సా పవర్స్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ నుంచి రూ.10 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ఫండ్స్‌ కింద ఫ్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి మూడు దఫాలుగా రూ. 75 కోట్లు, రూ.10 కోట్లు, రూ. 5 కోట్లు.. మొత్తం రూ.90 కోట్లు అందాయి.