CM Jagan: ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహాలు ఉంటాయి. సమయం, సందర్భం అనుకూలంగా ఈ సాగుతుంటాయి. ఒక్కోసారి విజయవంతమవుతాయి. లేకుంటే ఫెయిలవుతాయి. కానీ ఈ వ్యూహాలు ఒక్కదానితో ఆగిపోవు. ఒకటి కాకుంటే మరొకటి.. అది కాకుంటే ఇంకొకటి.. ఇలా వ్యూహాలు మారుతుంటాయి కానీ నిలిచిపోవు. అయితే ఈ వ్యూహాలు అమలు చేయడంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. తండ్రి రాజశేఖరరెడ్డికి మించి వ్యూహకర్త అని పేరు తెచ్చుకున్నారు.
ఎన్నికల సమీపిస్తుండడంతో సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలవకూడదని భావించారు. అందుకు తగ్గ వ్యూహాలు రూపొందించారు. బిజెపిని అడ్డం పెట్టుకొని ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. ఒత్తిడిలను అధిగమించి మరి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. టిడిపి, జనసేనల కూటమి వైపు బిజెపి రాకుండా వ్యూహం పన్నారు. కేంద్ర పెద్దలతో ఉన్న సన్నిహిత్యంతో అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారు. కానీ అది ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర బిజెపి నాయకత్వం టిడిపికి అనుకూలంగా ఉండడం, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీని టార్గెట్ చేసుకోవడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో దానికి విరుగుడుగా ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించి పురందేశ్వరిని ఎదుర్కోవడంతో పాటు బిజెపిలో ఒకరకమైన వాతావరణం కల్పించాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ బిజెపి టిడిపి రూట్లోకి వస్తే.. ఎదుర్కొనేందుకు అనేకరకాల వ్యూహాలను జగన్ సిద్ధం చేసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు వద్ద విచ్ఛిన్నం వచ్చేలా పొలిటికల్ గేమ్ ను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జనసేనలోకి వైసిపి కోవర్టులను పంపించేందుకు సిద్ధపడుతున్నారు. తద్వారా సీట్ల కేటాయింపు సమయంలో రగడ చేయడానికి ప్రణాళిక రూపొందించారు.అది జరగకుంటే.. బిజెపికి బాహటంగా మద్దతు తెలపడం గానీ.. వ్యతిరేకించడం కానీ చేయాలని చూస్తున్నారు. మొత్తానికైతే జగన్ ప్లాన్ ఏ, బీ, సీ, డీ లకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించిన నాయకుడిగా జగన్ గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే సాహసం చేయడానికి సైతంవెనుకడుగు వేయరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ దిట్ట. మరి ఎన్నికల ముంగిట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.