BRS Vs Congress: గులాబీ పార్టీ టార్గెట్ గా.. కాంగ్రెస్ పార్టీ “పంచ”తంత్రం

కర్ణాటకలో లాగానే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీలో చేరికలకు విశేషమైన ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలోని కీలక నాయకులకు గాలం వేస్తోంది.

Written By: Bhaskar, Updated On : July 24, 2023 5:46 pm

BRS Vs Congress

Follow us on

BRS Vs Congress: ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికార భారత రాష్ట్ర సమితి పంచుడు కార్యక్రమాలకు తెరతీసింది. గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలను ఉద్దరిస్తామని ప్రకటించింది. జీతాలే సక్రమంగా ఇవ్వని దశలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామని ఆశ కల్పించింది. దివ్యాంగులకు ₹1000 పింఛన్ పెంచింది. వచ్చే రోజుల్లో మైనార్టీలకు లక్ష రుణం ఇస్తామని ప్రకటించింది. భవిష్యత్తులోనూ మరిన్ని పంచుడు కార్యక్రమాలకు తెర తీస్తామని సంకేతాలు కూడా ఇచ్చింది. మేమేం తక్కువ తినలేదని కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రజలకు 5 గ్యారంటీస్ అమలు చేస్తామని ప్రకటించింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణమాఫీ, నాలుగు వేల రూపాయల పింఛన్, పేదలకు ఇళ్ళు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది.. ఇలాంటి పథకాలను అమలు చేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

కర్ణాటకలో మాదిరే..

కర్ణాటకలో లాగానే అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీలో చేరికలకు విశేషమైన ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలోని కీలక నాయకులకు గాలం వేస్తోంది. ఇందులో ఇప్పటికే చాలామంది నేతలు చిక్కారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంత ఆషామాషీ గా తీసుకోవడం లేదు. దీని కోసం చాలా పకడ్బందీ ప్రణాళిక రచించింది. ముఖ్యంగా బీసీలను ఆకట్టుకునేందుకు 45 సీట్లు వారికే కేటాయిస్తున్నట్టు అంతర్గతంగా సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న మైనార్టీ వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలో ప్రకటించిన విధంగానే వారికి కూడా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. మహిళలను ఆకట్టుకునేందుకు గతంలో పావలా వడ్డీకి రుణాలు ఇచ్చినట్టు.. ఈసారి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. కర్ణాటకలో మాదిరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించే విషయాన్ని పరిశీలిస్తోంది.

గెలుపు గుర్రాలకే టికెట్లు

మరో వైపు ఎన్నికల్లో అర్థ బలం ఉన్న వారికి కాకుండా ప్రజల్లో చరిష్మా ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా విజయాఅవకాశాలు కోల్పోయింది. అయితే ఈసారి ఆ తప్పు పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. సునిల్ బృందం మాత్రమే కాకుండా ఇతరులతో కూడా సర్వే చేయించి అందులో ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వారికి టికెట్లు ఇచ్చేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒక గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ల విషయంలో కలగజేసుకునేది. కానీ ఈసారి ఆ పరిస్థితికి చెక్ పెట్టి.. స్థానిక నాయకత్వంతో ఒక కమిటీ ఏర్పాటు చేయించి.. దాని సిఫారసు మేరకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా వచ్చే ఎన్నికలకు ప్రతి విషయంలోనూ పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. మరి ఓటర్లు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.