
MLA Rasamayi Balakishan: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల విమర్శలు.. స్వపక్ష సభ్యులు జోకులతో ఒకవైపు సీరియస్‌గా.. ఇంకోవైపు నవ్వులు పూసేలా సాగుతున్నాయి. తెలంగాణ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో చాలా రోజుల తర్వాత మానకొండూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌కు మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్రమంలో మైమరచిపోయిన రసమయి తన మాటలతో హాస్యం పండించారు. ఒక దశలో కేసీఆర్‌ను పొగడాలన్న తపనతో తనను తాను కించపర్చుకున్నారు.
దళితుల అభ్యున్నతిపై పొగడ్తలు..
బడ్జెట్ ప్రసగంలో మానకొండూర్ ఎమ్మెల్యే దళితుల సంక్షేమంపై మాట్లాడారు. దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రెసిడెన్సియల్ పాఠశాలలు తెచ్చారని అన్నారు. అభినవ అంబేద్కర్‌గా అభివర్ణించారు రసమయి. దళిల్లో విద్యా విప్లవం తీసుకురావాలని, ఊరికి బయట ఉన్న దళితులను ఊరి మధ్యలో నిలపాలని కేసీఆర్ 268 రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. తన నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే ఐదు రెసిడెన్సియల్ పాఠశాలలు నెలకొల్పారని పేర్కొన్నారు.
ఇంగ్లిష్ మాట్లాడుతుంటే సంబురమైంది..
తన నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలోని పాఠశాలకు ఒక రోజు వెళ్లానని పిల్లలను చూస్తే తన కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయని తెలిపారు. గతంలో పిల్లలకు బట్టులు లేకుండేవని, ఇప్పుడు పిల్లలు టక్కెసుకుని ఎదురొస్తే సంబురమైందని అన్నారు. మా పుల్లయ్య, మా మల్లయ్య, మా ఎంకన్న కొడుకు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతుంటే పట్టలేనంత ఆనందం కలిగిందని తెలిపారు.
సన్నబియ్యం అన్నం తింటున్నరు..
తాను చదువుకునే రోజుల్లో సంక్షేమ హాస్టళ్లలలో దొడ్డు బియ్యం అన్నం తినేవాళ్లమని, తాను కూడా హాస్టళ్లో చదువుకున్నానని, దొడ్డుబియ్యమే తిన్నానని చెప్పాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అందరికీ సన్నబియ్యం భోజనం పెడుతున్నారని గొప్పగా చెప్పారు.
ఎవరెస్టు ఎక్కుతున్నారు..
దళితులకు నాడు కనీస ప్రోతాసహం కూడా లేదని, కేసీఆర్ చొరవతో దళితలు ఎవరెస్టు ఎక్కుతున్నారని, రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఇస్తున్న శిక్షణతో అన్నిరంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీ దళిత కుటుంబంలో ఒకరు డాక్టర్ చదువుతున్నాడని గొప్పగా వర్ణించారు రసమయి. అంబేద్కర్ విద్యానిధి కారణంగా దళితులు విమానం ఎక్కి విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు.

నన్ను గింతంతే ఉన్నవ్ అంటరు..
ఇక అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ గురించి రసమయి బాలకిషన్ గొప్పగా చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను గొప్పగా చూసే ప్రయత్నం చేస్తూ.. తన గురించి తానే తక్కువ చేసి మాట్లాడుకున్నారు. ‘అందరూ నువ్వు గింతంతే ఉన్నవ్ అంటుంటరు.. నాడు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పుడ కేసీఆర్ ఇస్తున్నట్లు పౌష్టికాహారం, పాలు ఇస్తే నేను కూడా ఆరడుగులు ఎదిగేటోన్ని కావచ్చు’ అని తన ఎత్తు గురించి మాట్లాడారు. కేసీఆర్ ఇప్పు పిల్లల ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారని తెలిపారు.
మొత్తంగా ముఖ్యమంత్రిని ఎత్తుకునే క్రమంలో రసమయి అసెంబీ వేదికగా తనను తక్కువగా చూసించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంగన్‌వాడీలకు కేంద్రం నిధులు ఇస్తుంటే రసమయి కేసీఆర్ ఇస్తున్నట్లు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కేసీఆర్‌కు భజన చేయడమే రసమయి తన పనిగా పెట్టుకున్నారని మరి కొందరు కామెంట్ చేశారు.
