Homeజాతీయ వార్తలుBRS: ఆ ప్రకటనలతో కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తున్న బీఆర్ఎస్

BRS: ఆ ప్రకటనలతో కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తున్న బీఆర్ఎస్

BRS: తెలంగాణలో ఇంకా కొత్త సర్కార్ కొలువు తీరలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకులు సంచలన ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని తేల్చి చెబుతున్నారు. హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. త్వరలో వస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాజాగా మరో మాజీమంత్రి బాంబు పేల్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం చాలా ఈజీ అని.. కెసిఆర్ అనుకుంటే ఇట్టే అధికారంలోకి రాగలరని తేల్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ పార్టీ అంటేనే విభేదాలు గుర్తుకొస్తాయి. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ. పదవులు కోరే సీనియర్లు అధికం. పైగా పార్టీలో ఎప్పటినుంచో ఉన్నామన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. పార్టీలోకి వచ్చిన ఆరేళ్లకే రేవంత్ సీఎం అయిపోవడం మిగతా వారికి సహజంగానే మింగుడు పడదు. పైగా అది కాంగ్రెస్ పార్టీ కావడంతో ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదన్నది బీఆర్ఎస్ నేతల భావన. బహుశా ఈ ధీమాతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకున్నారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ను లైట్ తీసుకోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీని 64 స్థానాల్లో నిలబెట్టారు. అయితే అది ఏమంత మెజారిటీ కాదని బీఆర్ఎస్ నేతలు చెబుతుండడం విశేషం. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్కు సైతం ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చిన మెజారిటీ వచ్చింది. కానీ నాడు విపక్షాల నుంచి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు రివర్స్ జరుగుతుందన్నది బీఆర్ఎస్ నేతల భావన. అధికార పక్షం ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటామని.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు కొనసాగదని వారి ధీమా.

బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మంది వీర విధేయులని నాయకత్వం నమ్మకం పెట్టుకుంది. కానీ అక్కడ కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు లాంటివారే విధేయులు. ఇప్పటికే ఎల్బీనగర్ ఎమ్మెల్యే తో పాటు 14 మంది కాంగ్రెస్కు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎమ్మెల్యేలకు వ్యాపారాలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన విధంగానే తమను చేయరన్న బెంగ వారిని వెంటాడుతోంది. ఈ లెక్కన అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఆర్ఎస్ లోకి వెళ్లే వారి కంటే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేవారు ఎక్కువమంది అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

అయితే ఇది తెలియని కేటీఆర్ త్వరలో మనమే వస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు కేవలం ఐదు సీట్లు ఎక్కువగా ఉన్నాయని.. అదేమంత పెద్ద విషయం కాదని.. కెసిఆర్ సింహంలా బయటకు వస్తారని చెప్పుకొస్తున్నారు. బిజెపితో కలిసి ఆపరేషన్ కమల్ ప్రయోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నది కడియం శ్రీహరి ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అయితే శ్రీహరి ప్రకటనను సాకుగా చూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుంటే మాత్రం అందుకు బాధ్యులు ఎవరన్నది ప్రశ్న. సహజంగా ఎదురు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే అధికారపక్షం పై ఒక రకమైన అపవాదు పడుతుంది. కానీ ఆ అవకాశం లేకుండా బీఆర్ఎస్ నేతలే కవ్వింపు ప్రకటనలు చేస్తుండడం విశేషం. మున్ముందు రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి. కచ్చితంగా బీఆర్ఎస్ నేతల ప్రకటనలు మాత్రం ఆ పార్టీకి చేటు తెస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version