BRS Focus On AP: ఏపీ పై బీఆర్ఎస్ ఫోకస్ పెరుగుతోంది. విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ మార్కు రాజకీయాలు ఏపీలో మొదలుకానున్నాయి. కేసీఆర్ కూతరు, ఎమ్మెల్సీ కవిత కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. భారీ బహిరంగ సభకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత కేసీఆర్ ఫోకస్ అంతా ఏపీ పైనే పెట్టారు. తెలుగు రాష్ట్రం కావడం, పాత పరిచయాలు ఉండటం కారణంగా పార్టీ విస్తరణ, బలోపేతం సులువు అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నేతలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. ఏపీలోని అసంతృప్త నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి, భారీగా చేరికలు ప్రోత్సహించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.
ఏపీ పై ఫోకస్ లో భాగంగా తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఏపీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఏపీ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈనెల 19న ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాత ఏపీ సభ పై దృష్టి పెడతారని తెలుస్తోంది. జనవరి 29న కల్వకుంట్ల కవిత ఏపీలో పర్యటించనుంది. ఫిబ్రవరిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.

ఏపీలో ఇతర పార్టీ నేతలతో పాటు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు బీఆర్ఎస్ కారు ఎక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీ, జనసేనల్లో టికెట్ దక్కని వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాలని భారీ స్కెచ్ వేస్తోంది. జనసేన, టీడీపీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత కేసీఆర్ ఇతర రాష్ట్రాల పై పూర్తీ స్థాయి ఫోకస్ పెడతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.