BRS- BJP And Congress: తెలంగాణ.. పొలిటికల్ వార్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని విధంగా తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అస్తిత్వం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతుంది. అధికార బీఆర్‌ఎస్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ మాటల దాడికి దిగుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ చెప్పబోతున్నారంటూ బీజేపీ.. బీఆర్‌ఎస్ పుణ్యామాని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ వేదికగా కేసీఆర్ సర్వ దర్శనం కలిగిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. మరోవైపు నడ్డా విమర్శలపై ఆటమ్ బాంబ్ పేల్చారు మంత్రి హరీశ్‌రావు.. ఇలా మూడు ప్రధాన పార్టీల వార్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.

బీఆర్‌ఎస్‌పై బీజేపీ సెటైర్లు..
సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్‌లు మాటల దాడి చేస్తున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌పై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ సెటైర్లు వేశారు. ప్రజలు కేసీఆర్‌ను వద్దనుకుంటున్నారు.. అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు వీఆర్‌ఎస్ చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు.
నడ్డాకు కౌంటర్ ఇచ్చిన హరీశ్..
కరీంనగర్ సభలో బీజీపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా బీఆర్‌ఎస్ పార్టీపై చేసిన విమర్శలకు మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఇచ్చిన హామీలేన్ని? అందులో నెరవేర్చినవి ఎన్నో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమి తర్వాత కూడా బీజేపీకి జ్ఞానోదయం కాలేదనిఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి వెళ్లారని.. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ అంటూ ప్రాసకోసం పాట్లు పడ్డారంటూ నడ్డా వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు..
రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నొక్కేస్తున్నానరని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు దక్కని కేసీఆర్ దర్శనం.. ఢిల్లీలో లభించిందని చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు చేసిన మల్లురవి సొంత రాష్ట్రంలో ఓడిపోయిన నడ్డా తెలంగాణకు వచ్చి అబద్దాలు చెప్పి వెళ్లారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తంగా రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది ముందు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిపెట్టగా, అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తాము అంటూ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి.