British Rule In AP: అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ఎదురించిన నేల మనది. గాంధేయవాదంతో బ్రిటీష్ వారిని తరిమికొట్టిన వారసులం మనం. నాటి బ్రిటీష్ చట్టాలపై పోరాడిన మనం.. ఇప్పుడు అవే చట్టాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ కూడా పోరాడాల్సిన దుస్థితికి దిగజారాం. బ్రిటీష్ రాజ్యాన్ని ఏపీలోనూ పునరావృతం చేశారు అభినవ బ్రిటీష్ కారుడు సీఎం జగన్. సొంత ప్రజలపైనే, నేతలపై బ్రిటీష్ రూల్ ను ప్రయోగించాడు. మరి ఇది ఏం రాజ్యమో అర్థం కాని పరిస్థితి.

-అసలు ఏంటి ‘బ్రిటీష్ రూల్’..నిబంధనలు ఏమిటి?
బ్రిటీష్ వారు భారతీయుల నిరసనలు అణిచివేయడానికి రూపొందించిందే ఈ ‘1861 బ్రిటీష్ పోలీస్ లా’. దీన్ని జగన్ సార్ ఇప్పుడు ఏపీలోని ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి ప్రయోగించారు. పోలీస్ శాఖ బాధ్యతలు, విధులు, అత్యవసర, విచక్షణాధికారాలు గురించి 1861 బ్రిటీష్ పోలీస్ లాలోని 23వ నిబంధన ద్వారా చాలా విషయాలను స్పష్టంగా పొందుపరిచారు. అందులో ఇప్పుడు జగన్ సర్కారు ఒక లైన్ తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టకూడదని ఆదేశాలిచ్చింది. వాటిని నిషేధిస్తూ ప్రత్యేక జీవో జారీచేసింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కందుకూరు. గుంటూరులో చంద్రబాబు సభల్లో పలువురు ప్రజలు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. విపక్షాలను అణచివేసేందుకేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రజా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే విపక్ష నేతల సభలు, సమావేశాలకు పోలీస్ ప్రొటక్షన్ కల్పించవచ్చు కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటిదేమీ లేకుండా బ్రిటీష్ కాలం నాటి పాడుపడిన 1861 పోలీస్ లాను ప్రయోగించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదేం బ్రిటీష్ రాజ్యం కాదు కదా? అని ప్రశ్నిస్తున్కనారు.
1861 పోలీస్ లాలో 23వ నిబంధన ప్రకారం.. ఊరేగింపును నిషేధించే అధికారం పోలీస్ శాఖకు ఉంది. – ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమని భావించిన సందర్భంలో నిషేధాన్ని అమలుచేయవచ్చు. అయితే అటువంటి నిషేధానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఒక వేళ ప్రభుత్వ అనుమతి లేకుంటే మాత్రం వారం రోజుల వరకూ నిషేధం చెల్లుబాటు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నిషేధం విధించిన ప్రాంతాలకు వెళ్లకూడదు. వెళితే మాత్రం శిక్షకు అర్హలవుతారు. అయితే ఇప్పుడు ఏకంగా హోంశాఖే ఈ జీవో జారీచేయడంతో అమలుచేయడం వంతు పోలీస్ శాఖకు వచ్చింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుంతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. 160 ఏళ్ల కిందట బ్రిటిష్ కాలంలో పెట్టిన 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవోలో ఉన్న వెసులబాటులను అధికార పార్టీ వినియోగించుకోనుంది. నిషేధాన్ని మాత్రం ప్రతిపక్షాలపై అమలుచేసే అవకాశముంది.

-ప్రతిపక్షాలకు అలా.. అధికార వైసీపీకి ఇలా.. ఇదేం న్యాయం?
అయితే ఈ పురాతన ‘బ్రిటీష్ పోలీస్ లా’లో చాలావరకూ వెసులబాటులు ఉన్నాయి. వాటిని అధికార పార్టీ వినియోగించుకునే అవకాశముంది. ప్రతిపక్షాలకు మాత్రమే నిషేధం వర్తించేలా… అధికారపక్షం మాత్రం ఎలాంటి సమావేశాలనైనా నిర్వహించుకునేలా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించుకున్నారు. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే పర్మిషన్ ఇవ్వొచ్చునని చెప్పుకొచ్చారు. అయితే అవి ఎలాగూ అధికార పార్టీ నేతలకు ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో వారి హక్కులను కాలరాసేలా వైసీపీ సర్కారు పురాతన పోలీస్ చట్టాన్ని పదును పెట్టి అమలుచేయాలని చూస్తోంది.
-విపక్షాల గొంతునొక్కేందుకే ‘బ్రిటీష్ పోలీస్ లా’
బ్రిటీష్ పోలీస్ లాను ఏపీలో అమలు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విపక్షాలను గొంతునొక్కే ప్రయత్నాలు ప్రారంభించిందని.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిని దుర్మార్గపు చర్యగా ఖండిస్తున్నారు. తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆయన సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. విపక్ష నేతగా ఆయన పర్యటనలకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కానీ కందుకూరు, గుంటూరు ఘటనలను సాకుగా చూపి ఇప్పుడు విపక్షాల గొంతును పూర్తిగా నొక్కే ప్రయత్నం చేస్తోంది.