Bride Marries Sister’s Groom : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదేయ్..’ అని పాటలో ఎంతగా దాన్ని సమర్థించినా ఇక్కడ పెళ్లిలో మాత్రం కుడి ఎడమై చెల్లి మెడలో పడాల్సిన తాళి అక్క మెడలోకి వచ్చింది. దీనికంతటికి కారణం కరెంట్ కోతలు కావడం విశేషం. అవును.. కరెంట్ కోతలు జనాలను ఇబ్బంది పెట్టడమే కాదు.. ఏకంగా ఓ పెళ్లిని పెటాకులు చేసే వరకూ తీసుకెళ్లింది. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో చోటుచేసుకుంది.
పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే మన దగ్గర అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని మరీ సంబంధాలు కలుపుకుంటాం.. ఈ క్రమంలోనే ఓ పెద్దింటి మనిషి తన ఇద్దరు కూతుళ్లకు ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు ఆ పెళ్లి రోజు రానే వచ్చింది.అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పెళ్లిని చూసేందుకు బంధుమిత్రులంతా తరలివచ్చారు. అప్పటివరకూ అంతా సవ్యంగానే సాగింది. అక్కడే అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది.
Also Read: Vijay Deverakonda Triple Role: ఉఫ్.. ‘చిరంజీవి – ఎన్టీఆర్’లనే కొట్టగలడా ?
వేసవి కాలం కావడం.. దేశంలో కరెంట్ కోతల పుణ్యమాని మధ్యప్రదేశ్ లోనూ అస్సలు కరెంట్ ఉండడం లేదు. కొద్దిరోజులుగా విపరీతంగా కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి రెడీ అయిన జంటకు నిజంగానే ‘కరెంట్ షాక్’ తగిలింది. ఒక్కసారిగా తాళి కట్టే సమయానికి కరెంట్ పోయింది. మళ్లీ ఇలాంటి ముహూర్తం లేదని పండితుడు చెప్పడంతో ఆ చీకటిలోనే పెళ్లి చేసేశారు. ఈ గందరగోళంలో పీటలపై వరుడు మారిపోయాడు. అటూ ఇటూ జరిగే సరికి తన సోదరి చేసుకోబోయే వరుడిని చెల్లి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండడం వల్ల ఎవరూ వరుడు మారిపోయిన విషయాన్ని గమనించలేకపోయారు.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ కు చెందిన రమేశ్ కు ‘నిఖిత, కరిష్మా’ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తన కూతుళ్ల పెళ్లిని రమేశ్ నిశ్చయించారు. పెళ్లిమండపంలో తాళికట్టే సమయానికి కరెంట్ కట్ కావడం.. ఇద్దరూ ఒకే డ్రెస్ లో ఉండడంతో అక్క చేసుకోబోయే వరుడు చెల్లెలుకు తాళి కట్టేశాడు.
పెళ్లి తంతు ముగిసిన తర్వాత అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. కరెంట్ పోయిన టైంలో తాను తన సోదరి చేసుకోబోయే వరుడిని పెళ్లి చేసుకున్నానని గ్రహించిన చెల్లెలు.. పెద్దలందరినీ పిలిచి ఈ విషయం చెప్పింది. దీంతో ఆ పెళ్లింట కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవలతో చేసేదేం లేదని భావించి మరుసటి రోజు మళ్లీ పెళ్లి నిర్వహించారు. అలా ఆ వివాదం సద్దుమణిగింది. మొత్తానికి కరెంట్ కట్ ఎంత పనిచేసింది.. ఏకంగా పెళ్లి కుమారుడినే మార్చేసిందని పలువురు ఎద్దేవా చేశారు. ఇప్పుడీ విషయం మధ్యప్రదేశ్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా కరెంట్ కోతలపై సెటైర్లు అవకాశం కల్పించింది.