
దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. పరిస్థితులు చేయిదాటిపోయేలా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా ఒకరోజు 25వేల కేసులు నమోదు కావడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం రెండో వేవ్ ను సరిగ్గా ఎదుర్కోలేదని.. కరోనా టీకాలను విదేశాలకు పంచి దేశంలో వేయకపోవడమే కొంప ముంచిందన్న అపవాదును మూటగట్టుకుంది.
ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలను దేశంలో దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. వాటిని దేశ ప్రజలకు పంచాలని నిర్ణయించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభించనున్నారు.
టీకాల కొరతతో అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలతో కేంద్రంలోని బీజేపీ సర్కారు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. దేశవ్యాప్తంగా ఇన్నాళ్లు 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే టీకాలు వేస్తుండగా.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా కరోనా టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా కరోనా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని స్పష్టం చేసింది.
మే 1 నుంచి జూలైలోపు అందరికీ కరోనా టీకాలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగనుంది. ఈ మూడో దశ తర్వాత దేశమంతా కరోనా రహితంగా మారే అవకాశాలు ఉన్నాయి. 18 ఏళ్లలోపు వారికి రోగ నిరోధకత ఎక్కువగా ఉండడం.. వారికి అప్పటికే టీకాలు పడి ఉండడంతో దేశాన్ని కరోనా ఫ్రీగా చేయడానికి కేంద్ర సర్కార్ నడుం బిగించింది.