Vallabhaneni Vamsi- kodalli Nani: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఎన్టీఆర్ కంటే వైఎస్సార్ యూనివర్సిటీ పేరుకు అర్హుడంటూ కొందరు మంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం కరెక్ట్ అని అమాత్యులు బదులిస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా తమకు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానమంటూనే ఆయన పేరిట ఉన్న యూనివర్సిటీని తన తండ్రి పేరును మార్చుకున్నారు. అయితే ఇది అధికార పార్టీలో చాలామందికి నచ్చలేదన్న టాక్ వినిపిస్తోంది. అయినా సీఎం ఉన్నపలంగా నిర్ణయం తీసుకోవడంతో వారంతా మిన్నకుండా ఉండిపోయారు. అంతర్గత చర్చల్లో మాత్రం ఇది మంచి పద్ధతి కాదన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే సీఎం ఏ వ్యూహం మీద మార్చి ఉంటారోనన్న అనుమానం కూడా ఉంది. వాస్తవానికి ఎన్టీఆర్ పేరు మార్చడం అంత అషామాషి పనికాదు. ఎన్నోరకాల విమర్శలు, రాజకీయ ఇబ్బందులు వస్తాయి. అయితే ఎన్నొరకాల తర్జనభర్జనల తరువాతే సీఎం ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

అటు ప్రధాన విపక్షంతో పాటు కొన్నివర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ జగన్ వీటన్నింటినీ లెక్క చేయలేదు. ఆన్ లైన్ కేబినెట్ లో ఆమోదం తీసుకున్నారు. వెంటనే అసెంబ్లీలో పెట్టి బిల్లు ఆమోదం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చేశారు. కనీసం తదుపరి పరిస్థితులు ఎలా ఉంటాయని వైసీపీ ఎమ్మెల్యేలెవరితోనూ సీఎం ఆలోచించలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. వారే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ఇందులో కొడాలి నాని మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్. ఎన్టీఆర్ ను అభిమానిస్తూనే చంద్రబాబును ధ్వేషిస్తుంటారు. అటు వల్లభనేని టీడీపీ నుంచి గెలిచి.. ప్రస్తుతం వైసీపీకి దగ్గరగా ఉన్నారు.
అయితే ఇందులో వల్లభనేని వంశీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన వెంటనే రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా జగన్ ను బతిమలాడుకున్నారు. పెద్ద మనసుతో జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన మీరు.. యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో పునరాలోచించుకోవాలని విన్నివించారు. అటు కొడాలి నాని అయితే ఈ అంశంపై ఇంతవరకూ స్పందించలేదు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం ఈ ఇద్దరికీ ఇబ్బందికరంగా మారింది. అటు సామాజికవర్గపరంగా ఇప్పటికే వీరిపై అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. చంద్రబాబుతో పాటు లోకేష్ ను తూలనాడుతూ ఉంటారు. ఇది కమ్మసామాజికవర్గంలో మెజార్టీ ప్రజలకు నచ్చడం లేదు. ఇద్దరి నియోజకవర్గాలూ కృష్ణా జిల్లాలో ఉండడం, ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పుతో వీరిద్దరికి రాజకీయంగా నష్టమే.

ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు వీరిద్దరి అభిప్రాయాన్ని కచ్చితంగా తీసుకొని ఉంటుందని టాక్ నడుస్తోంది. వల్లభనేని వంశీ సీఎం జగన్ కు రిక్వెస్ట్ చేయడం పొలిటికల్ డ్రామాగా టీడీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం ఎక్కువ. పైగా ఎన్టీఆర్ ను ఆరాధ్య దైవంగా భావిస్తారు. అయితే ఇది ఎక్కడ ప్రతికూలంగా మారుతుందోనని వంశీ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. అటు ఎన్టీఆర్ మాట వల్లెవేసే నాని మాత్రం ఇంతవరకూ నోరు తెరలేదు. ఆయన ఏం మాట్లాడాలో పీకే టీమ్ సిద్ధం చేస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.