Black Demon Fish Video : ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పరిశోధకులు కొత్త విషయాలు కనిపెడుతున్నా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సముద్రపు అడుగుభాగంలో అనేక మర్మమైన జీవులు నివసిస్తున్నాయి. ఈ జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయి. కొన్ని జీవులు చూసేందుకు చాలా భయంకరంగా ఉంటాయి. వీటిని చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కొన్నిసార్లు ఈ జంతువులు సముద్రపు ఉపరితలంపై కనిపిస్తాయి. వాటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో బయటకు వచ్చింది. ఇందులో హంప్‌బ్యాక్ యాంగ్లర్ ఫిష్ కనిపిస్తుంది. దీనిని ‘బ్లాక్ సీ మాన్స్టర్’ లేదా ‘బ్లాక్ సీ డెవిల్ ఫిష్'(Black Demon Fish) లేదా నల్ల సముద్ర రాక్షసుడు అని కూడా పిలుస్తారు.
ఈ ‘నల్ల సముద్ర రాక్షసుడు’ స్పెయిన్‌లోని టెనెరిఫ్ తీరంలో కనిపించింది. మెరైన్ ఫోటోగ్రాఫర్ డేవిడ్ జారా బోగునా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ చేప అద్భుతమైన వీడియోను పంచుకున్నారు. ఈ ఆవిష్కరణ అద్భుతంగా ఉందని, ఈ చేపను సజీవంగా చూసే భాగ్యం చాలా తక్కువ మందికి మాత్రమే ఉందని ఆయన అన్నారు. వీడియోలో ఒక ముదురు గోధుమ రంగు చేప నోరు తెరిచి ఈత కొడుతుండటం కనిపిస్తుంది. ఈ చేప భయంకరమైన దంతాలను కూడా క్లిప్‌లో చూడవచ్చు. సమాచారం ప్రకారం.. బోగునా, కాండ్రిక్-టెనెరిఫ్ ఎన్జీఓల పరిశోధకులు కొన్ని రోజుల క్రితం ఈ రాక్షస చేప వీడియోను రూపొందించారు. వారు సొరచేపల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు, టెనెరిఫ్ తీరానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఈత కొడుతున్న ఈ చేపను చూశారు.
ఈ ప్రత్యేకమైన చేప గురించి…
హంప్‌బ్యాక్ యాంగ్లర్ ఫిష్ సముద్రంలో 200 నుండి 2000 మీటర్ల లోతులో నివసిస్తుంది. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, బీచ్‌కు చాలా దగ్గరగా ఈ చేప కనిపించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. జెరూసలేం పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఆ యాంగ్లర్ ఫిష్ నీటి ఉపరితలం దగ్గర కనిపించిన కొన్ని గంటల తర్వాత గాయపడి చనిపోయింది. తదుపరి దర్యాప్తు కోసం చేప మృతదేహాన్ని శాంటా క్రజ్ డి టెనెరిఫేలోని ఒక మ్యూజియంకు పంపారు. ఈ చేప ఉష్ణమండల, ఉపఉష్ణమండల సముద్రాలలో కనిపిస్తుంది.