ఇప్పటి వరకు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చిన ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను కూడా అందులోకి చేర్చాలని భావిస్తోంది. దానికి సంబంధించిన జీవోను నేడో రేపో విడుదల చేయనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. అయితే మరోవైపు కరోనా కంటే స్పీడ్ గా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి అవసరమైన మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో అది సోకిన వారికి సరైన చికిత్స అందడం లేదు.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఖరీదైన ఇంజెక్షన్లతో పాటు అపరేషన్లు కూడా ఎక్కువే చేయాలని కొందరు వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు అంత డబ్బు సమయానికి అందక చాలా మంది చనిపోతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్ పై అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన మెడిసిన్స్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఆసుపత్రులను అలర్ట్ చేయాలని కొందరు సూచిస్తున్నారు. కొందరు బ్లాక్ ఫంగస్ కేసులను తీసుకోవడం లేదు. దీంతో బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం కరోనా మాదిరిగా బ్లాక్ ఫంగస్ పై కూడా కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే వ్యాధి బారిన పడ్డవారిని కాపాడుకోవచ్చని అంటున్నారు.