BJP Vs Congress: టీకాంగ్రెస్.. మొన్నటి వరకు అంతర్గత కలహాలు.. అలకలు.. అధిష్టానానికి ఫిర్యాదులు. పీసీసీ చీఫ్‌ను తప్పించాలనే డిమాండ్లు.. అసలైన కాంగ్రెస్.. వలస వాదుల కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. అదే సమయంలో బీజేపీలో ఐకమత్యం.. అధికార బీఆర్‌ఎస్‌పై సమష్టి పోరాటం.. ఏ కార్యక్రమం చేసిన కలిసి పనిచేసే నాయకులు కనిపించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.. బీజేపీలోని ఐక్యత కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు బీజేపీలో కనిపిస్తున్నాయి. మూడేళ్లు సమష్టిగా పెంచిన బీజేపీ వృక్షాన్ని.. ఆ పార్టీ నాయకులే నరికివేసే ప్రయత్నం రేస్తున్నారు. ఫలితంగా తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. బీజేపీ బలహీనతలే ఇప్పుడు కాంగ్రెస్‌కు బలంగా మారుతున్నాయి.
నాడు కాంగ్రెస్ పతనానికి అవే కారణం..
తెలంగాణలో కాంగ్రెస్ పతనానికి ఐక్యతా లోపం, అంతర్గత కలహాలే ›ప్రధాన కారణం. నాయుడి నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని కూడా వీడారు. దీంతో పదేళ్లు కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ బలహీనతలే 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బలంగా మారాయి.
ప్రస్తుతం బీజేపీలో..
ప్రస్తుతం బీజేపీలో నాటి కాంగ్రెస్ బలహీనతలే నేడు కనిపిస్తున్నాయి. ఇవే కాంగ్రెస్‌ను బలం పుజుకునేలా చేస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ను భయపెడుతున్నాయి. జాకీలు పెట్టి లేపినా లేవలేని పరిస్థితిలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ బలహీనతలను తమ బలంగా మార్చుకుని బలం పుంజుకుంటోంది. స్వంత ఎదుగుదల కంటే బీజేపీ వైఫల్యమే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ను బలంగా ఉన్నట్లు చూపుతోంది.
కర్ణాటక తరహాలో..
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపాయి. దీంతో కలహాలు పార్టీకి నష్టం చేస్తాయని.. అధికారంలోకి రాలేమని గుర్తించిన నేతలు, కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ఐక్యతనే ముఖ్యమనే వాస్తవం గ్రహించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు ఒక్కటవుతున్నారు. తాజాగా దీని ప్రభావం ఖమ్మం సభలో స్పష్టంగా కనిపించింది. సభ సక్సెస్ కావడానికి ఐక్యతే ప్రధాన కారణం.
అధికారంలోకి వస్తుందా..
తెలంగాణలో బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా.. అధికారంలోకి వచ్చేంత బలం ఉన్నట్లు కనిపించడం లేదు. దీనికోసం ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఐక్యత కాంగ్రెస్‌లో ఎక్కువ కాలం ఉండదు. ఏ చిన్న సమస్య వచ్చినా నాయకులు వర్గాలుగా విడిపోవడం కాంగ్రెస్‌కు అలవాటే. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల వరకు ఐక్యంగా కొనసాగితే కాంగ్రెస్‌కు అది ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.