BJP – Chandrababu : బిజెపి ఆలోచనలో మార్పు వస్తోందా? తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకుంటుందా? చంద్రబాబుకు తలుపులు తెరిచిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీఏకు సారధ్యం వహిస్తున్న బిజెపిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏను పునరేకికరించాలని బిజెపి భావిస్తోంది. అందులో భాగంగా గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉండి వివిధ కారణాలతో వెళ్లిపోయిన వారిని.. తిరిగి ఎన్డీఏ గూటికి చేర్చాలన్న ప్రయత్నంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
కర్ణాటకలో జేడిఎస్ ఇటీవల ఎన్డీఏలో చేరింది. గతంలో ఇదే కూటమిలో ఉండేది. వివిధ కారణాలతో బయటకు వెళ్ళింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ గూటికి చేరుకుంది. మరోవైపు నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియూ ఎన్డీఏలో తిరిగి చేరింది. గతంలో నితీష్ కుమార్ ఎన్డీఏలో నమ్మదగిన నేత. కొన్ని కారణాల రీత్యా ఎన్డీఏకు దూరమయ్యారు. ఇప్పుడు బిజెపికి దగ్గరయ్యారు. బిహార్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పంజాబ్ లో అకాలిదళ్, మహారాష్ట్రలో ఉద్ధవ్ లు సైతం ఎన్డీఏకు చేరువ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చంద్రబాబును సైతం పిలుస్తున్నట్లు సమాచారం.
ఏపీలో గతం కంటే పరిస్థితి మారుతోంది. విపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. గతంలో ఎటువంటి సర్వే వచ్చినా వైసీపీకి ఏకపక్ష విజయం దక్కేది. కానీ ఇటీవల బీజేపీ ఓ జాతీయ సంస్థతో ఏపీలో సర్వే చేపట్టింది. ఏపీలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేలింది. జగన్ ప్రభుత్వం పై విపరీతంగా ప్రజా వ్యతిరేకత పెరిగిందని సర్వే తేల్చింది. దీంతో బిజెపిలో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. చంద్రబాబును కూటమిలోకి తీసుకొని.. వీలైనంత పార్లమెంటు స్థానాలను ఎక్కువగా తీసుకోవాలని బిజెపి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అటు జనసేన మిత్రపక్షంగా ఉంది. ఆ రెండు పక్షాలతో ఏపీలో రాజకీయాలు నడపాలని బిజెపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదని బిజెపి భావిస్తోంది. అందుకే ఇండియా కూటమిలోని కీలక రాజకీయ పక్షమైన జేడీయును తమ వైపు తిప్పుకుంది. ఈసారి జాతీయస్థాయిలో ఎన్డీఏ 400 పార్లమెంటు స్థానాలు దక్కించుకొని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయాలని చూస్తోంది. అందుకే నితీష్ కుమార్, చంద్రబాబు లాంటి నాయకులు అండదండలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు విషయంలో బిజెపి మెత్తబడినట్లేనని తేలుతోంది. ఇప్పటికే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఏపీలో పొత్తులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బిజెపి ప్రత్యేక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.