BJP Bandi Sanjay: కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ తీరు తగ్గేదేలే అన్నట్టుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ బహిరంగంగానే సవాల్ చేస్తుంటారు. ఇక అక్కడే కాదు.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నేతలది అదే దూకుడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంఐఎంకు చోటు లేకుండా చేస్తున్నారు కమలం పార్టీ నేతలు.
ఇక ఎంఐఎంనే ప్రత్యర్థిగా బహిరంగంగా పేర్కొంటూ నిప్పులు చెరుగుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఆటలు సాగనివ్వమంటూ తొడగొట్టేస్తున్నారు. ఎంఐఎంనే శత్రువుగా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చేరాడు. నేరుగా ఎంఐఎం పార్టీకి వార్నింగ్ ఇచ్చాడు.
తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచడంపై బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కేసీఆర్.. ‘పాతబస్తీలో కరెంట్ బిల్లులు ఎందుకు వసూలు చేయడం లేదని నిలదీశారు. పాత బస్తీలో వెయ్యి కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
యూపీలో అయినా.. మహారాష్ట్రలో అయినా బీజేపీ ప్రధాన టార్గెట్ ఎంఐఎం. కాంగ్రెస్ పని అయిపోవడంతో ఇప్పుడు హిందుత్వ ఓటు కోసం ఆ పార్టీపైనే పడుతున్నారు. ఇక ఎంఐఎం సానుభూతి ఓటర్లు ఎలాగూ బీజేపీకి వేయరు. అలా ఆ ఓటు పోయినా హిందుత్వ ఓటు గంపగుత్తగా పడేందుకు ఈ స్ట్రాటజీని అమలు చేస్తున్నారని అర్థమవుతోంది.
ఇప్పటికే 2023లో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీకి తెలంగాణలో గెలుపు అత్యవసరం. అందుకే వ్యూహాత్మకంగా పాతబస్తీ టార్గెట్ గా రాజకీయం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా తెలంగాణలో హిందుత్వ ఓటు బ్యాంకును ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ పాత బస్తీలో 1000 కోట్ల కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడాన్ని తెలంగాణ బీజేపీ అందిపుచ్చుకుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ ను, ఎంఐఎంను ఇరుకునపెట్టేందుకు రెడీ అవుతోంది. మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీసుకొస్తున్న ఈ కొత్త అస్త్రానికి ఎంఐఎం, టీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాలి.