Janasena BJP Alliance
Janasena BJP Alliance: తెలంగాణలో చివరి నిమిషంలో బిజెపి జనసేన హ్యాండ్ ఇవ్వనుందా? తన దారి తాను చూసుకోనుందా? జనసేనతో పొత్తు నష్టమని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ బిజెపి నేతల తీరు చూస్తుంటే జనసేనతో కటీఫ్ చెప్పడమే మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జనసేన తో కలిసి పోటీ చేస్తే లాభం కంటే.. నష్టం అధికమని బిజెపి నేతలు భావిస్తున్నారు. హై కమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. కేవలం మద్దతు వరకు మాత్రమే ఓకే చెప్పాలని సూచిస్తున్నారు.
బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయంలో ఏకంగా సోషల్ మీడియాలో ఒపీనియన్ పోల్స్ పెట్టారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని ప్రశ్నించారు. దాదాపు పదివేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపితో జనసేన పొత్తు ముమ్మాటికి.. బిఆర్ ఎస్తో పాటు కెసిఆర్ కే లాభమని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. బిజెపికి లాభమని కేవలం 31 శాతం మంది మాత్రమే చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి జనసేనతో పొత్తువద్దని బలంగా కోరుకుంటున్నారు. ఈ జాబితాలో చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు. ఒక్క ఎంపీ లక్ష్మణ్ మాత్రమే జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి జనసేన తెలంగాణ ఎన్నికలను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. కేవలం తమకు బలమున్న 33 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించాలని భావించారు. ఆమేరకు మాత్రమే ప్రకటన చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అయినా తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బిజెపితో కలిసి పోటీ చేయాలని భావించలేదు. కానీ తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి తనకు తానుగా జనసేన మద్దతు కోరింది. మద్దతు ఇవ్వలేం కానీ పొత్తు అయితే చూస్తామని పవన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లు పవన్ ను తీసుకుని వెళ్లి అమిత్ షా తో సమావేశపరిచారు. దీంతో పొత్తు ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి.కానీ సీట్ల విషయమై ఎటువంటి ప్రకటన లేదు.
అయితే జనసేనతో కలవడం బిజెపిలోని మెజారిటీ తెలంగాణ నాయకులకు ఇష్టం లేదు. కేవలం మద్దతు ఒకే కానీ.. పొత్తు అయితే బిఆర్ఎస్ కు ప్రచార అస్త్రంగా మారుతుందని భయపడుతున్నారు. పైగా జనసేనకు సరైన అభ్యర్థులు లేరు. సీట్లు ఇచ్చినా ఓట్లు అయితే వస్తాయి కానీ.. గెలుచుకునేంత స్థాయిలో రావని బిజెపి నేతలు భయపడుతున్నారు. అటు జనసేన సైతం బిజెపి బలంగా ఉన్న నియోజకవర్గాలనే కోరుతుంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరులో బిజెపికి మంచి అభ్యర్థులు ఉన్నారు. అదే జనసేన విషయానికి వస్తే సరైన అభ్యర్థులు కనిపించడం లేదు.జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో అభద్రతాభావం పెరిగింది. అందుకే జనసేన ను పోటీ నుంచి తప్పించాలని.. మద్దతు ప్రకటన చేయాలని.. ఈ మేరకు పవన్ పై కేంద్ర పెద్దలతో ఒత్తిడి పెంచాలని తెలంగాణ బిజెపి నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే టిడిపి, వైయస్సార్ టిపి పోటీ నుంచి తప్పుకోవడంతో పవన్ పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో బిజెపి అగ్ర నేతలు ఒత్తిడి చేస్తే పవన్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో పవన్ బిజెపికి మద్దతు ప్రకటన చేస్తారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.