Homeజాతీయ వార్తలుBJP- KCR: బీజేపీ యూటర్న్‌.. కేసీఆర్‌ వైఫల్యాలపై సైలెంట్‌.. అసలు కారణమేంటి?

BJP- KCR: బీజేపీ యూటర్న్‌.. కేసీఆర్‌ వైఫల్యాలపై సైలెంట్‌.. అసలు కారణమేంటి?

BJP- KCR: బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ‘దశాబ్ది’ఉత్సవాలకు కౌంటర్‌గా ‘రివర్స్‌ గేర్‌’ కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనను కమల దళం విరమించుకుంది. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై రాష్ట్ర పార్టీ చేపట్టాలని భావించిన ఎదురుదాడి కార్యక్రమాలకు బీజేపీ హైకమాండ్‌నో చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై నిర్వహిస్తున్న ‘మహా జనసంపర్క్‌ అభియాన్‌’లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో బీజేపీ రివర్స్‌ గేర్‌ విరమణతో ఆ ప్రచారం నిజమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర నేతల దూకుడుకు.. అధిష్టానం బ్రేక్‌..
జాతీయ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 30 నుంచి జూన్‌ 30 వరకు ‘మహా జనసంపర్క్‌ అభియాన్‌’ వరకు నిర్వహించే కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు. ఈమేరకు అధిష్టానానికి ప్రతిపాదన కూడా చేశారు. షెడ్యూల్‌ కూడా ఖరారు చేశారు. కానీ ఏమైందో ఏమో.. ఈ కార్యక్రమాల్లో నెగిటివ్‌ ప్రచారం వద్దని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల మోదీ పాలనపై పాజిటివ్‌ ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించి ప్రజల్లోకి వెళ్లాలని అధినాయకత్వం సూచించింది. దీంతో రాష్ట్ర నేతల దూకుడుకు బ్రేక్‌ వేసినట్లుయింది.

కాంగ్రెస్‌ చేతికి మరో అస్త్రం..
బీఆర్‌ఎస్‌పై రివర్స్‌గేర్‌ కార్యక్రమాలు రద్దయినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్‌ చేతికి మరో అస్త్రం దొరికింది. బీఆర్‌ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ప్రస్తుత పరిణామాలు ఉండటం పార్టీ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. జన సంపర్క్‌ అభియాన్‌ ముగియగానే మళ్లీ కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతామని పార్టీ నాయకులు చెబుతున్నారు.

నాటి దూకుడు ఏది?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలక ముందు వరకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించాయి. దర్యాప్తు సంస్థలను కూడా రంగంలోకి దించాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో దూకుడు తగ్గింది. మరోవైపు కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శల దాడి, వాడి కూడా తగ్గింది. అదే సమయంలో కేసీఆర్‌ కూడా బీజేపీ ప్రభుత్వంపై, మోదీపై మౌనం వహిస్తున్నారు. బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ను మాత్రమే కేసీఆర్‌ టార్గెట్‌ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను పల్లెత్తు మాట కూడా అనడం లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular