పవన్ కళ్యాణ్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి బీజేపీ పై బాణాలు సంధించాడు. బీజేపీ తో కలిసి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే బీజేపీ కి షరతులు మొదలయ్యాయి. అలా అయితే బీజేపీ తో కటీఫ్, కానీ బీజేపీ అలా చెయ్యదు. బీజేపీ అలాచెయ్యదని నమ్మకమున్నప్పుడు మొదటి ప్రకటన ఎందుకు? చిన్నపిల్లలు మొరాం చేసినట్లుగా వుంది. రాజకీయాల్లో ఒకసారి అభిప్రాయం ఏర్పడితే పోగొట్టుకోవటం చాలా కష్టం. ఇప్పటికే తనకు పరిపక్వత లేదు, సీఎం స్టఫ్ కాదని పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు. అటువంటప్పుడు ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవాలంటే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మరొక్కసారి పప్పులో కాలేసినట్లు కనబడుతుంది. అదేంటో చూద్దాం.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనాల్లో ఉండటానికి ప్రయత్నం చేయటం శుభపరిణామం. చాలామంది అనుకున్నట్లు గా కాకుండా ఎక్కువకాలం రాజకీయాల్లో ఉండటం హర్షించదగ్గ పరిణామం. ఇటీవలే తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించడంపై వివాదం చెలరేగినా మేధావులు , ప్రజలు తన వివరణపై అనుకూలంగా స్పందించారు. అంతవరకూ బాగానేవుంది. అలాగే ఇటీవల జరిగిన ఇంకో పరిణామం పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తుపెట్టుకోవటం. ఇది కూడా ఊహించని పరిణామమే అయినా తన భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఒక జాతీయపార్టీతో పొత్తుపెట్టుకోవటం వలన వచ్చే నాలుగు సంవత్సరాలు ఎన్నికలవరకు పార్టీని నడపటానికి ఈ వ్యూహాత్మక పొత్తు ఉపయోగపడుతుందని భావించారు.
కొన్ని లోపాలున్నా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ఎత్తుగడలు స్థూలంగా వివాదాస్పదం కాలేదని చెప్పొచ్చు. బీజేపీ తో పొత్తు తో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికలనాటికి ఎదిగే అవకాశం ఉందని కూడా పరిశీలకులు భావించారు. అన్నీ సాఫీగా సాగుతున్న సమయంలో ఆవేశానికి పోయి అనర్ధాలు కొని తెచ్చుకోవటం పవన్ కి అవసరమా? ఎంత సర్దిపుచ్చుకొని తనమీద అభిమానంతో సమర్ధించేవాళ్లకు కూడా ఒక్కోసారి చిరాకు తెప్పించటం పవన్ కళ్యాణ్ కే చెల్లింది. బీజేపీ తో పొత్తుపెట్టుకున్నప్పుడు మాట్లాడిన మాటలు ఆయన అభిమానులు, ప్రజలు మరిచిపోలేదు. అసలు నేను మొదట్నుంచీ బీజేపీ అభిమానినే అన్నట్లు మాట్లాడి ఎటువంటి షరతులు లేకుండా బీజేపీ కి మద్దత్తిస్తున్నట్లు చెప్పటం ఇంకా అందరికీ గుర్తే వుంది. అటువంటిది నిన్న అమరావతి లో మాట్లాడుతూ బీజేపీ కనక వైస్సార్సీపీ తో పొత్తు పెట్టుకుంటే నేను బీజేపీ తో కటీఫ్ చేసుకోవటం ఖాయమనే రీతిలో మాట్లాడటం అందరికీ ఆశ్చర్యమేసింది. అదేసమయంలో బీజేపీ ఆపని చేయదనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేయటం జరిగింది. రైతులు వేసిన ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాలిగానీ బెదిరించినట్లు, బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాధానం వుండకూడదు. రైతులకు రాజధాని ఒక్కటే సమస్య . అందులో వాళ్ళను తప్పుపట్టాల్సినది ఏమీలేదు. వాళ్ళ భవిష్యత్తు అంధకార బంధురంగా ఉండటంతో అనుమానాలు నివృత్తి చేసుకోవటం కోసం బీజేపీ-వైస్సార్సీపీ పొత్తుపై ప్రశ్నించారు. కానీ సమాధానం చెప్పేటప్పుడు దానివలన వచ్చే పర్యవసానాలు ఆలోచించుకొని మాట్లాడాలి. కేవలం బీజేపీ అటువంటి పొత్తు పెట్టుకోదని నా నమ్మకం అని చెప్పి ఉంటే బాగుండేది. దానితో ఆగకుండా అలా జరిగితే నేను తప్పుకుంటానని చెప్పటం ప్రజల్లో చులకనభావం ఏర్పడే అవకాశం వుంది. ఎందుకంటే బీజేపీ తో జతకట్టిందే మొన్న, అదీ ఎటువంటి షరతులు లేకుండా అని కూడా నొక్కి వక్కాణించి ఇప్పుడు వేరేగా మాట్లాడితే విమర్శలకు తావిచ్చినట్లయ్యింది.
జగన్ పార్టీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని టీడీపీ బి టీం గా ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అది వాస్తవం కాక పోవచ్చు. అయినా అటువంటి అభిప్రాయం బలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఇప్పటి సమాజంలో నిజాయితీగా ఉండటమే కాదు నిజాయితీగా వున్నట్లు ప్రజలు అనుకునేటట్లు కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. నిన్నటి సంఘటన అలాగా లేదు. కేవలం రాజధాని విషయంలో బీజేపీ పై ఒత్తిడి పెంచటానికే ఈ ఒప్పందం చేసుకున్నారని వైస్సార్సీపీ ప్రచారం చేయటానికి ఊతం ఇచ్చేలా వుంది. రాజధాని రైతులను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తే అది మొదటికే మోసం వస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధానికి ఇన్ని ఎకరాలు అవసరం ఉండదని ఆరోజే చెప్పాననటం తన దూరదృష్టికి నిదర్శనంగా హర్షించే అవకాశం వుంది. అమరావతి రైతుల తరఫున మాట్లాడటం, రెండు కులాల ఘర్షణగా సమస్యని మార్చారని చెణుకులు విసరటం, బీజేపీ లో ఈ సమస్యపై గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించటం లాంటి వి తను కూడా ప్రస్తుత రాజకీయాలపై చక్కగానే విశ్లేషిస్తున్నాడనే అభిప్రాయం, తన ఆలోచనల్లో పరిణితి వచ్చిందని ప్రజలు భావించేటట్లుగా వున్నాయి. కానీ వున్నట్లుండి ఊహాగానాలపై ఆధారపడి అలాగయితే బీజేపీ పొత్తునుంచి వైదొలుగుతానని చెప్పటం మిగతా పాజిటివ్ ఒపీనియన్ నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చింది. బీజేపీ అధిష్టానం లో కూడా ఈ ప్రకటన వల్ల వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం వుంది. బీజేపీ తో పొత్తు పెట్టుకోకముందే సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వుండాల్సింది. ఒకసారి పొత్తుపెట్టుకున్న తర్వాత ఎదో ఒక విషయంలోనో , ఊహాగానాలపై ఆధారపడో సంచలన ప్రకటనలు ఇవ్వకూడదు. దానివలన మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గతానుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే మంచిది. లేకపోతే వచ్చే ఎన్నికలనాటికి ఎదురు దెబ్బలే తగులుతాయి. తస్మాత్ జాగ్రత్త.