Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర వంద కిలోమీటర్లు పూర్తయింది. ఆగస్టు 28వ తేదీన యాత్ర మొదలు పెట్టిన సంజయ్ గడిచిన తొమ్మిది రోజులుగా యాత్ర కొనసాగిస్తున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర మొదలు పెట్టిన సంజయ్.. పాతబస్తీ, గోషా మహల్, నాంపల్లి, జూబ్లిహిల్స్, కార్వాన్, చేవెళ్ల నియోజకవర్గాల్లో యాత్ర పూర్తిచేశారు. ప్రస్తుతం వికారాబాద్ నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ వద్ద వంద కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకోవడంతో కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ వంద కిలోల కేక్ కట్ చేశారు.
రోజుకు సగటున 12 కిలోమీటర్ల మేరకు నడుస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. బండి సంజయ్ వెంట నిత్యం 500 మంది వరకు ఉండేలా చూస్తున్నారు. ఆయా గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు, నాయకులు బండితో కలిసి నడుస్తున్నారు. అవకాశం చూసుకొని జాతీయ నాయకులు యాత్రలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర ప్రారంభంలో పాల్గొనగా.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల యాత్రలో పాల్గొన్నారు.
అయితే.. పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా.. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. యువకులు, మహిళలు సంజయ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రైతు బీమా దరఖాస్తులు, పంటలకు గిట్టుబాటు ధర, కౌలు రైతులకు రైతుబంధు అమలు వంటి అంశాలతోపాటు నిరుద్యోగులు నోటిఫికేషన్ల గురించి సంజయ్ కు విన్నవిస్తున్నారు. నోటిఫికేషన్లతోపాటు నిరుద్యోగ భృతి ఇప్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి వారు తమకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఈ విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుండడంతో.. బండి సంజయ్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర విజయవంతంగా కొనసాగేందుకు నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యం వందలాంది మంది బండి సంజయ్ యాత్రలో కనిపిస్తుండడంతో.. రాష్ట్రంలో పార్టీకి మరింత జోష్ వచ్చింది. కార్యకర్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సానుభూతి పరులు, పలు ప్రజాసంఘాల నాయకులు బండికి మద్దతు తెలుపుతున్నారు.
దీంతో.. బండి సంజయ్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని, శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవినీతిని నిరూపిస్తామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ను జైలుకు పంపించడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bjp telangana state president bandi sanjay padayatra completed 100 kilometers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com