BJP Target Jharkhand- Delhi: దేశంలో బీజేపీ అతిశక్తివంతమైన పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీలను, కూటమిలను కాషాయ పార్టీ కబళిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రను తన చెప్పుచేతల్లోకి తీసుకుంది. ఇప్పుడు దాని కన్ను జార్ఖండ్, ఢిల్లీలపై పడినట్టు కనిపిస్తోంది. ఇప్పడు బీజేపీ అంటేనే ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జేఎంఎం, అమ్ ఆద్మీ పార్టీలు వణికిపోతున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలపై కేంద్ర నిఘా సంస్థలు కన్నేశాయి. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై దాడులు చేశాయి. కేసులు నమోదు చేశాయి. జార్ఖండ్ లో సీఎంగా హేమంత్ సొరెన్ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమిని నడుపుతున్నారు. ఇప్పుడు ఆయనపైనే ఏకంగా బీజేపీ గురిపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఈసీకి నేరుగా లేఖ రాశారు. ఆయన పేరిట గనుల కంపెనీలు ఉన్నాయని..లాభదాయకమైన పదవిలో ఉండడం వల్ల ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ సూచించారు. అయితే దీని వెనుక బీజేపీ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జార్ఖండ్ సీఎంపైనే గురి..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి హేమంత్ సోరెన్ మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీతో కూటమి నడుపుతుండడం, బీజేపీకి వ్యతిరేకిస్తుండడంతో విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతారని భావించారు. కానీ ఆయన అనూహ్యంగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. ఆమెకు అనుకూలంగా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఓటు వేయించారు. అప్పట్లోనే బీజేపీ హెచ్చిరికల మూలంగా ఆయన యూటర్న్ తీసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. కూటమిని పడగొడతారన్న అభయంతోనే ఆయన వెనక్కి తగ్గారన్న అనుమానాలైతే వచ్చాయి. కానీ ఎన్టీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినా బీజేపీ కనికరించలేదు. నేరుగా సీఎం హేమంత్ సోరెన్ ను టార్గెట్ చేసింది. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటు సన్నిహితులను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయి. పావులు కదుపుతున్నాయి.

కేజ్రీవాల్ లో టెన్షన్..
ఇప్పుడు అచ్చం జార్ఖండ్ పరిస్థితులే ఢిల్లీలో కనిపిస్తున్నాయి. అక్కడ సీఎంగా కేజ్రీవాల్ ఉన్నారు. రెండు, మూడు స్థానాలు తప్పించి అన్నిచోట్ల ఆప్ గెలుపొందింది. మరోవైపు పంజాబ్ లో సైతం అధికారం చేజిక్కించుకుంది. ఇది సహజంగా మింగుడుపడడం లేదు. రాజధానిలో తమకు కంట్లో నలుసుగా ఉన్న ఆప్ ను ఎలాగైనా దెబ్బతీయ్యాలని బీజేపీ పెద్దలు భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ మాఫియా రూపంలో అరుదైన అవకాశం వచ్చింది. అందుకే కేంద్ర నిఘా సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. కేసులు నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమ పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని.. మొత్తం 40 మందిని కొనుగోలు చేసేందుకు 800 కోట్లు సిద్ధం చేసిందని..కానీ తమ ఎమ్మెల్యేలెవరు అమ్ముడుపోరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కానీ కొందరు టచ్ లో లేకపోవడం, సమావేశాలకు హాజరుకాకపోవడం వంటి వాటితో కేజ్రీవాల్ సైతం టెన్షన్ పడుతున్నట్టుంది. మొత్తానికైతే ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది.

