ఇప్పటికే కాంగ్రెస్.. టీఆర్ఎస్ చెందిన ప్రముఖ నేతలంతా కాషాయతీర్థం పుచ్చుకున్నాయి. అయితే గ్రేటర్లోనూ టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి చేరుతుండటంతో చర్చనీయాంశంగా మారింది.
జీహెచ్ఎంసీలోని 150డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 56సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీకి 48.. ఎంఐఎం కు 44.. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకున్నాయి.
మేయర్ పీఠంపై టీఆర్ఎస్.. బీజేపీలు కన్నేశాయి. ఈక్రమంలోనే ఇరుపార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ షూరు చేశాయి. టీఆర్ఎస్ కే మేయర్ పీఠం అవకాశాలున్నప్పటీకీ గ్రేటర్లోని టీఆర్ఎస్ నేతలు బీజేపీవైపు చూస్తుండటం ఆసక్తిని రేపుతోంది.
ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె.రామక్రిష్ణ.. జంపన ప్రతాప్.. భానుక నర్మద.. భానుక మల్లీకార్జున్.. టి.ఎన్.మురారి.. బాణాల శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలు బీజేపీ గూటికి చేరారు.
తాజాగా ఏడవ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.బి.శంకర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కె.బీ.శంకర్ రావుకు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీతోనే కంటోన్మెంట్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.