
టీఆర్ఎస్ పై ఐటీ, ఈడీ దాడులు చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇలా అన్నాడో లేదో అలా మొదలైపోయాయి. సీఎం కేసీఆర్ పై కూడా దాడులు చేసి జైలుకు పంపిస్తానని బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అయితే ముందుగా పార్లమెంట్ లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా నాగేశ్వరరావుపై ఈడీ దాడులు చేయడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనమైంది.
టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో కేంద్రదర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేయడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనమైంది. నామాకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా ఐదు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
నామా రుణాల పేరుతో బ్యాంకులను సుమారు రూ.1000 కోట్లు మోసం చేసినట్లుగా వచ్చిన అభియోగాలతో ఈడీ ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. నామా ఇంటితోపాటు మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
నామానాగేశ్వరరావు గతంలో రాంకీ ఎక్స్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా సంస్థల అకౌంట్లు డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారు అన్వేషిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈడీ సోదాలు సాగనున్నాయి. ఆ తర్వాత దీనిపై అధికారులు వివరణ ఇస్తారు.
టీఆర్ఎస్ ఎంపీపై ఈడీ దాడులతో కలకలం చెలరేగింది. ఆ తర్వాత ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ దాడులు కొనసాగుతాయా? ఇంకా ఏఏ నేతలపై జరుగుతాయన్నది టీఆర్ఎస్ లో గుబులు రేపుతోంది.