Thota Chandrasekhar- MLA Raghunandan Rao: ఏపీ బీఆర్ఎస్ బాధ్యతలు చేపట్టగానే తోట చంద్రశేఖర్ కు కొత్త కష్టమొచ్చి పడింది. ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ తెరవక ముందే అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరిక వెనుక ఉన్న చీకటి బాగోతాన్ని బీజేపీ బట్టబయలు చేసింది. ఖమ్మం సభకు తోట చంద్రశేఖర్ దే ఖర్చంతా అంటూ ఆరోపణలు చేసింది.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తోట చంద్రశేఖర్ కు హాఫిజ్ పేటలోని సర్వే నెంబర్ 78 లో వున్న 40 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అమ్ముకోవడానికి సర్కార్ అనుమతి మంజూరు చేసిందని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ భూమి విలువ 400 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. ఇదే సర్వే నెంబర్ లో ఎంబిఎస్ జువెలర్స్ సుఖేష్ కు చెందిన 8 ఎకరాల భూమిని విక్రయించేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతివ్వడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యవహారాన్ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తుచేశారు.
గతంలో ఇదే సర్వే నెంబర్లో 8 ఎకరాలు సుఖేష్ గుప్తా అనే వ్యక్తి అమ్ముకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా .. జిల్లా కలెక్టర్ అప్పట్లో సుప్రీం కోర్టుకు వెళ్లారని, ఇప్పుడెందుకు అలా చేయడం లేదని ప్రశ్నించారు. ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ సభకు ఖర్చంతా తోట చంద్రశేఖర్ పెడుతున్న నేపథ్యంలోనే 40 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు అనుమతిచ్చారని ఆరోపించారు. రఘునందన్ ఆరోపణలతో తోట చంద్రశేఖర్ ఉక్కిబిక్కిరవుతున్నారు.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు ఆదిత్య రియల్ ఎస్టేట్ అనే సంస్థ ఉంది. పెద్ద ఎత్తున హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సంస్థ వ్యాపారాలు నిర్వహిస్తోంది. తోట చంద్రశేఖర్ కు లాభం చేకూర్చిన సందర్భంలోనే బీఆర్ఎస్ లోకి వెళ్లినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ సర్వే నెంబర్ తో సహా బయటపెట్టడంతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యవహారం పై బీజేపీ సుప్రీం కోర్టుకు వెళితే తోట చంద్రశేఖర్ కు ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది.