BJP: పదేళ్లుగా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2019లో సైతం మరోసారి విజయం సాధించింది. 2014 కంటే 2019లో ఫలితాలను మెరుగుపరుచుకుంది. అయితే వరుసగా రెండుసార్లు విజయం సాధించినా.. రాజ్యసభలో మాత్రం మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో మిగతా రాజకీయ పక్షాలపై ఆధారపడక తప్పలేదు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలను తనను అనుకూలంగా మలుచుకుంది. గత ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ ను విభేదించి చంద్రబాబు బయటకు వెళ్లారు. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. దీంతో కేంద్రం నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని.. తన వద్ద ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపించారని ప్రచారం నడిచింది. మరోవైపు వైసీపీకి సైతం ఉన్న రాజ్యసభ సభ్యుల సహకారం తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ. అందుకే వైసిపి విషయంలో బిజెపి సానుకూలంగా ఉండడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అయితే పదేళ్ల తర్వాత బిజెపికి రాజ్యసభలో మెజారిటీ లభించింది. ఇకనుంచి ఆ పార్టీ ఇతరులపై ఆధార పడాల్సిన పనిలేదు. ఇప్పుడు వైసీపీలో భయానికి కూడా ఇదే కారణం. ఇప్పటికే చంద్రబాబు ఎన్డీఏలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి కడతాయి. కేంద్ర ప్రభుత్వపరంగా ఆ కూటమికి బిజెపి ఎనలేని సహాయ సహకారాలు అందిస్తుంది. అవి ఎన్నికల్లో ఎలా ఉంటాయో జగన్ కు తెలియనివి కావు. అందుకే ఆయనలో ఒక రకమైన భయం కనిపిస్తోంది.అయినా సరే జగన్ బిజెపిని విడిచి పెట్టే ఛాన్స్ లేదు. దానికి తన పై ఉన్న కేసులే కారణం.
ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. టిడిపికి కనీస ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే టిడిపికి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ అధికారానికి దూరమైతే మాత్రం.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంతవరకు ఆ పార్టీలో కొనసాగుతారు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇది అప్రస్తుతం అయినా.. వైసీపీ రాజకీయ అవసరాలు బిజెపికి తీరిపోయాయి. ఏపీలో బలపడాలన్న ఆకాంక్షతో బిజెపి అగ్ర నాయకత్వం ఉంది. ఈ తరుణంలో పొత్తుల ద్వారా లభించే సీట్లలో గెలుపొందడం, బలమైన సంస్థాగత నిర్మాణం చేపట్టడం వంటి వాటిపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ఇవి జగన్ కు కలవరపెట్టే అంశాలే .
గత ఐదు సంవత్సరాలుగా జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ పరంగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. బిజెపి పరంగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపినా.. కేంద్ర ప్రభుత్వ పరంగా జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఏనాడూ మోకాలు అడ్డలేదు. అయితే రాజ్యసభలో వైసిపి అవసరాలు మేరకు.. కేంద్రం ఇతోధికంగా జగన్ కు మద్దతు తెలుపుతూ వచ్చింది. కీలక బిల్లులు పాస్ కావడానికి వైసిపి సహకారం అందించింది. కాంగ్రెస్ తో పాటు విపక్షాలు రాజ్యసభలో బలంగా ఉండేవి. వాటిని ఎదుర్కోవడానికి వైసిపి సహకారం అనివార్యంగా మారింది. ఇప్పుడు బిజెపికి సొంత బలం రావడం, రాజ్యసభలో మెజారిటీ మార్కు దాటడంతో వైసిపి అవసరం లేకుండా పోయింది. అయితే ఇది జగన్ కు వ్యక్తిగతంగా లోటే. చంద్రబాబు ఎన్డీఏ లో చేరడంతో పాటు మూడోసారి.. బిజెపి కేంద్రంలో అధికారంలోకి రానుండడంతో మున్ముందు జగన్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.