Chandrababu- BJP: చంద్రబాబుకు కాస్త ఉపశమనం కలిగించే విషయం. తన పెద్దరికాన్ని గౌరవిస్తూ కేంద్ర పెద్దలు ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. అయితే అదేదో రాజకీయ సమావేశం కాదు.. పొత్తుల కోసం అంతకంటే కాదు. భారత్ లో నిర్వహించే జీ20భాగస్వామ్య దేశాల సమావేశాలను ఎలా నిర్వహిస్తే బాగుంటుందో అన్న అంశంపై చర్చించడానికి. అలాగని చంద్రబాబు ఒక్కర్నే కాదు. దేశంలో రాజకీయ పార్టీల అధినేతలందర్నీ సమావేశానికి పిలిచి అభిప్రాయాలను సేకరించనున్నారు. విలువైన సలహాలు, సూచనలు కోరనున్నారు. అందులో భాగంగానే చంద్రబాబుకు కేంద్ర పెద్దలు ఆహ్వానించారు. 2023లో జీ20 శిఖరాగ్ర సమావేశం భారత్ వేదికగా జరగనుంది. ఆతిథ్య దేశంగా భారత్ క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటోంది. అందుకే ముందస్తుగా సన్నాహాలు చేస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. కార్యక్రమ నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. డిసెంబరు 5న రాష్ట్రపతి భవన్ లో సదస్సు జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.

జీ20 దేశాలకు భారత్ సారధ్య బాధ్యతలు వహించనుంది. అందుకే వచ్చే ఏడాదిలో జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా భారత్ ప్రభ వెలుగుతోంది. గతంకంటే అన్ని అంశాల్లో పురోగతి సాధిస్తోంది. ఇప్పటికే సెప్టెంబరులో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నిర్వహించిన 14వ జాయింట్ కమిషన్ సమావేశం సక్సెస్అయ్యింది. ఇప్పుడు అదే స్పూర్తితో జీ20 శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు చేస్తోంది. దేశంలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. సమావేశానికి యూనైటెడ్ స్టేట్స్ ఎమిరేట్ ప్రతినిధి ప్రత్యేక ఆహ్వినితుడిగా రానున్నారు.

రాజకీయ పార్టీ అధినేతలకు ఆహ్వానం పంపినందున.. తప్పనిసరిగా జగన్ తో పాటు పవన్ కు ఇన్వయిట్ చేసే అవకాశముంది. అయితే ప్రస్తుతానికైతే మంత్రి ప్రహ్లద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించారు. సమావేశానికి సమయం ఉన్నందున జగన్ తో పాటు పవన్ ను పిలిచే అవకాశమున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే సమావేశానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశముంది. జగన్ అయితే డౌటే. ఎందుకంటే గతంలో ఆజాదీ కా అమృత్ దినోత్సవ వేడుకలకు జగన్, చంద్రబాబులతో పాటు పవన్ కు ఆహ్వానం అందింది. అయితే ఒక్క చంద్రబాబే హాజరయ్యారు. జగన్ ఢిల్లీలో ఉన్నా సమావేశానికి ముఖం చాటేశారు. పవన్ అనారోగ్యం కారణంగా వెళ్లలేదు. ఈ విషయంపై ముందుగానే సమాచారమిచ్చారు. ఇప్పుడు ఎవరెవరు ఈ సమావేశానికి హాజరవుతారన్నది తెలియడం లేదు. కొద్దిరోజులు పోతే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.