కృష్ణా జలాలపై ఇప్పుడు బిజెపి రెండు కళ్ళ సిద్ధాంతం!

గతంలో కీలకమైన అంశాలపై నిర్దుష్టమైన విధానం లేకుండా `రెండు కళ్ళ సిద్ధాంతం’ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు అనుసరించేవారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశమై ఇదేవిధమైన ధోరణి అనుసరించి రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు బీజేపీ సహితం శ్రీశైలం నుండి కృష్ణా జలాలను తరాయించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదం ఏర్పడిన సందర్భంగా ఇదే విధానం అనుసరిస్తుంది. ఒక వంక బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ […]

Written By: Neelambaram, Updated On : May 13, 2020 12:43 pm
Follow us on

గతంలో కీలకమైన అంశాలపై నిర్దుష్టమైన విధానం లేకుండా `రెండు కళ్ళ సిద్ధాంతం’ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు అనుసరించేవారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశమై ఇదేవిధమైన ధోరణి అనుసరించి రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు.

ఇప్పుడు బీజేపీ సహితం శ్రీశైలం నుండి కృష్ణా జలాలను తరాయించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదం ఏర్పడిన సందర్భంగా ఇదే విధానం అనుసరిస్తుంది. ఒక వంక బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కృష్ణా జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోకు నిరసనగా రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు.

మరోవంక, ఆ జిఓను సమర్ధిస్తూ ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఏపీకి ఉందనిస్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు.

తెలంగాణతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో, ఏమీ చేస్తారో తెలియదని… రాయలసీమకు మాత్రం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటాలు చేసిందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.

జాతీయ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ ఒకొక్క రాష్ట్రంలో ఒకొక్క విధానం అనుసరిస్తూ ప్రజల భవోద్వేగాలతో ఆటలాడుకొనే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ప్రాంతీయ పార్టీలకు ఎట్లాగూ తమ ప్రాంత ప్రజల పక్షాన నిలబడక తప్పదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ సహితం ఒక స్పష్టమైన విధానం ఆవలంభించలేదా?

ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంజయ్ కుమార్ దీక్ష చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని బీజేపీ తప్పు పడ్తోంది. జీవో 203పై తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ బోర్డ్, కోర్టుకు వెళ్ళాలని బీజేపీ డిమాండ్ చేసింది.

నీళ్లు ,నియామకాలు ,నిధులు పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ స్వార్ధ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురి అయ్యే అవకాశం ఉందని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అపర భగీరథుడు గా తన వందిమాగధులు చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.