
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జలాలను అక్రమంగా పోతిరెడ్డిపాడుకు తరలించుకు పోతుంటే తనకు ఏమీ తెలియన్నట్లు న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ప్రకటించడం పట్ల ప్రతిపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్, జగన్ ఇద్దరు తోడి తొండాలని, ప్రతిరోజూ మాట్లాడుకొంటూనే అన్ని చేస్తుంటాయని చెబుతూ ఇద్దరు కలసి కాంట్రాక్టర్ల ద్వారా ముడుపుల కోసం అన్ని చేస్తున్నారని మండిపడ్డారు.
అపర భగీరథుడు గా తన వందిమాగధులు చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
ఇటీవల కాలంలో జగన్ కు తానే మార్గదర్శకుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త లిఫ్ట్ గురించి తెలియకపోవడం తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడమే అని దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే-ఏపీ ప్రభుత్వం పెంచుతూ వెళ్తోందని, తెలంగాణ తగ్గించిన నెల రోజులకు ఏపీ పెంచినట్లు జివో విడుదల చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేసారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పోతిరెడ్డిపాడు అంశంలో మాట్లాడుకుని చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
“జగన్-కేసీఆర్ రోజు మాట్లాడుతున్నారు అంటున్నారు ఈ జీవో విడుదల సీఎం కేసీఆర్ కి తెలియకుండా జరిగిందా?”అని భట్టి ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసేంత వరకు తెలంగాణ ఇంటలిజెన్స్ ఏం చేస్తోందని, పోతిరెడ్డిపాడు పై జగన్-కేసీఆర్ మాట్లాడు కోలేదనే గ్యారెంటీ ఏంటని ఆయన అడిగారు. నదీజలాల పంపకాల విషయం అపెక్స్ కమిటీ-బోర్డ్ లో చర్చించకుండానే జీవో విడుదల చేసిందా? అని ప్రశ్నించారు
కొన్ని విషయాల్లో సంప్రదింపులు జరుపుకునే కెసిఆర్ జగన్ మాట మాత్రం చర్చించకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏడు వేల కోట్లతో ఫస్ట్ ఫేస్ కింద పనులు జరపాలని నిర్ణయం తీసుకొంటారా అంటి లక్ష్మణ్ నిలదీశారు.
కృష్ణా గోదావరి ట్రిబ్యున ళ్ళ ను తానే పద్ధతి ప్రకారం తీర్చిదిద్దాడని చెప్పే కెసిఆర్ కు చెప్పకుండా దక్షిణ తెలంగాణలో మూడు జిల్లాలను ఎండబెట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని బిజెపి నేత స్పష్టం చేశారు. కేసీఆర్ మొదటి నుండి ఉత్తర తెలంగాణపై దృష్టి సారిస్తూ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
“నువ్వు కొట్టినట్లు చెయ్ నేను ఏడ్చినట్లు చేస్తా “అన్న సామెత లాగా నడుస్తు ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని లక్ష్మణ్ కోరారు. ఇప్పటికైనా ఈ ప్రాంత శాసనసభ్యులు ఎంపీలు మాట్లాడకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.