Munugodu Jagadeesh Reddy: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్ ఘటనలో లోలోపల కుత కుత ఉడికిపోతున్న బిజెపి నాయకులు.. మునుగోడు ఉప ఎన్నిక ముందు టిఆర్ఎస్ ను అదును చూసి దెబ్బ కొట్టారు. ఈ ఉప ఎన్నికల్లో అన్ని తానయి వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పై రివెంజ్ తీర్చుకున్నారు. అతడు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అష్టదిగ్బంధనం చేశారు. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కక్కలేని మింగలేని పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా తమకు నష్టం చేకూర్చుతుందని టిఆర్ఎస్ నాయకులు లోలోపల మదన పడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగింది అంటే
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రచార బాధితులను భుజానికి ఎత్తుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.. జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించారని, ఫలితంగా నియోజకవర్గంలో 48 గంటల పాటు ప్రచారం నిర్వహించరాదు అంటూ ఆయనపై నిషేధం విధించింది. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యే సమయానికి చండూరులో ఆదివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జగదీశ్ రెడ్డి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈనెల 25న చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ” రెండువేల పింఛన్, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, దివ్యాంగులకు 3000 పింఛన్, ఇవన్నీ రావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. ఇవి వద్దు అనుకునేవారు మోడీకి ఓటు వేసుకోవచ్చు. ఈ ఎన్నిక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య కాదు. ఈ పోరుతో సంక్షేమ పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది తేలిపోతుంది” అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన బిజెపి రాష్ట్ర నేత కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ ఈనెల 28న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జగదీష్ రెడ్డికి నోటీసులు పంపింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. దీనిపై 29 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు జగదీశ్ రెడ్డి ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను వివరించే క్రమంలో తాను అలా మాట్లాడానని, టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని తాను అనలేదంటూ వివరణతో కూడిన లేఖను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేశారు.
అయితే ఈ వివరణపై ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తి చెందలేదు. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి 48 గంటల పాటు అంటే అక్టోబర్ 31 సాయంత్రం 7 గంటల వరకు జగదీశ్ రెడ్డి ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే జగదీష్ రెడ్డి మాత్రం ఓడిపోతామని భయంతోనే బిజెపి నాయకులు ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు.