https://oktelugu.com/

రాజధాని రగడ లో బిజెపి పాత్ర

రామ్ మాధవ్ ఉపన్యాసం రాజధాని పై ఇరుపక్షాలు తమకనుకూలంగా వుందని చెప్పుకోవటం ఆంధ్ర రాజకీయాల డొల్లతనాన్ని బయటపెడుతుంది. సాక్షి చానల్ ఆయన ఉపన్యాసం లోని తమకనుకూల భాగాన్ని కోట్ చేస్తే చంద్రబాబు అనుకూల చానళ్ళు అందులో తమకనుకూల భాగాన్ని కోట్ చేసారు. దీన్నిబట్టి వార్తల్ని ఎలా వక్రీకరిస్తున్నారో అర్ధమవుతుంది. రామ్ మాధవ్ భారతీయ జనతా పార్టీ లో సీనియర్ నాయకుడు. పార్టీకి క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు రామ్ మాధవ్ ట్రబుల్ షూటర్. అటు కాశ్మీర్ లోగానీ, ఇటు […]

Written By:
  • Ram
  • , Updated On : August 12, 2020 / 06:32 AM IST
    Follow us on

    రామ్ మాధవ్ ఉపన్యాసం రాజధాని పై ఇరుపక్షాలు తమకనుకూలంగా వుందని చెప్పుకోవటం ఆంధ్ర రాజకీయాల డొల్లతనాన్ని బయటపెడుతుంది. సాక్షి చానల్ ఆయన ఉపన్యాసం లోని తమకనుకూల భాగాన్ని కోట్ చేస్తే చంద్రబాబు అనుకూల చానళ్ళు అందులో తమకనుకూల భాగాన్ని కోట్ చేసారు. దీన్నిబట్టి వార్తల్ని ఎలా వక్రీకరిస్తున్నారో అర్ధమవుతుంది. రామ్ మాధవ్ భారతీయ జనతా పార్టీ లో సీనియర్ నాయకుడు. పార్టీకి క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు రామ్ మాధవ్ ట్రబుల్ షూటర్. అటు కాశ్మీర్ లోగానీ, ఇటు ఈశాన్య భారతం లోగాని రాజకీయల్లో వ్యూహాలు పన్నాల్సి వచ్చినప్పుడు పార్టీ తనని పంపిస్తుంది. కాబట్టి రామ్ మాధవ్ లాంటి వ్యక్తి మాట్లాడితే దానికి వాళ్ళ పార్టీలో ఎంతో విలువ వుంటుంది.

    రామ్ మాధవ్ ఏం చెప్పాడు?

    రామ్ మాధవ్ వాళ్ళ పార్టీ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాడు. ముందుగా అసలు హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ విజయవాడ వచ్చి టెంటుల్లో, తాత్కాలిక క్యాంపు ఆఫీసుల్లో ఎందుకు వుండాల్సి వచ్చిందో అందరికీ తెలుసని చంద్రబాబు కి చురకలంటించాడు. అమరావతి ఒక్క రాజధాని లోనే ఇంత అవినీతి జరిగితే మూడు రాజధానుల్లో ఇంకెంత అవినీతి జరుగుతుందోనని జగన్ కి కూడా చురకలంటించాడు. ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి కూడా ఒక్కటే రాజధాని వుందని గుర్తుచేసాడు. అదే సమయం లో అమరావతి రైతులకు న్యాయం చేయాలనేది తమ పార్టీ విధానమని ప్రకటించాడు. దానితో పాటు పార్టీ వేరు ప్రభుత్వం వేరని విపులంగా వివరించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా విజయవాడ పరుగెత్తుకొచ్చి తాత్కాలిక కార్యాలయాల్లో వున్నా , అమరావతి రాజధాని గా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అలాగే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులుగా ప్రకటించినా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే రాజ్యాంగం లో ఎవరి విధులు ఏమిటో స్పష్టంగా  వుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటే అది చేయలేదు. ఇప్పటికే రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పై ఆరోపణలు చేస్తున్నాయి. కాబట్టి రామ్ మాధవ్ కేంద్ర ప్రభుత్వానికి వున్న పరిమితులు వివరించి తమ పార్టీ మాత్రం అమరావతి రాజధాని గా కొనసాగాలని కోరుకుంటుందని చెప్పాడు. విశేషమేమంటే దీన్ని ఎవరికివాళ్ళు ముక్కలు చేసి వాళ్లకు అనుకూలంగా ప్రసారం చేసారు.

    మరి గొడవ ఎక్కడుంది?

    ఆంధ్ర రాష్ట్రం లో టిడిపి , వై ఎస్ ఆర్ సి పి లు రాజకీయాల్ని శాసిస్తూ తెలివిగా కేంద్రాన్ని ఇరికిస్తుంటాయి. అదేమంటే మోడీ శంఖుస్థాపన కి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మోడీ జోక్యం చేసుకోవాలనేది వాదన. అప్పుడేమో మోడీ మట్టి, నీళ్ళు తెచ్చాడని విమర్శించారు, ఇప్పుడేమో జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని ఆపలేదని విమర్శ. ఆరోజు అమరావతి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకెక్కడ పెట్టినా కూడా మోడీ వచ్చి ఉండేవాడు. ఎందుకంటే రాష్ట్ర రాజధాని ఎక్కడా అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం. ప్రధానమంత్రి హోదా లో శంఖుస్థాపనకు రావటం ఆనవాయితీ. అంతేగానీ ఏదో కోర్టుల్లో వాదనలు లాగా ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టటం సబబుకాదు. ఇటీవల బిజెపి లో చేరిన కొంతమంది ముఖ్యంగా సుజనా చౌదరి , లంకా దినకర్ లాంటి వాళ్ళు బిజెపి విధానానికి విరుద్ధంగా టిడిపి తో మమేకమై పోయి బిజెపి ప్లాట్ ఫార్మ్ ని వాడుకోవలనుకోవటం తోనే పేచీ అల్లా. బిజెపి పార్టీగా వ్యతిరేకించటం వేరు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని భ్రమలు కల్పించటం వేరు. వచ్చిన గొడవల్లా ఇక్కడే. ముఖ్యంగా సుజనా చౌదరి రైతుల్ని తన స్వార్ధానికి వాడుకోవటానికి బిజెపి వేదికని వాడుకోవటం తో ఇదేదో బిజెపి లో అంతర్గత తగాదా లాగా మిగతా పార్టీలు, మీడియా ప్రచారం చేయటానికి ఆస్కారం ఏర్పడింది. అసలు సుజనా చౌదరి ప్రవేశం తో రైతుల ఉద్యమంపై అనుమాన బీజాలు మొదలయ్యాయి.  జగన్ పార్టీ వ్యక్తులు దీనివెనక రియల్ ఎస్టేట్ లాబీ వుందని ప్రచారం చేయటానికి సుజనా చౌదరి రంగ ప్రవేశాన్ని ప్రముఖంగా ఎత్తిచూపుతున్నారు. అనొచ్చు , ఎవరు మద్దత్తిచ్చినా తీసుకుంటామని . కానీ ఉద్యమం నడిపేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు సుజనా చౌదరి , ఏమి చెబుతారు? బిజెపి ని విమర్శిస్తూ బయటకు వస్తారా? సందేహమే. వ్యాపారవేత్తల్ని అతిగా నమ్మటం మొదటికే మోసం. ఇప్పటికైనా రైతులకు అర్ధమై వుండాలి.

    బిజెపి దూకుడు సబబేనా?

    సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత క్యాడర్ లో నూతనోత్సాహం వచ్చినమాట నిజమే. కానీ భిన్నాభిప్రాయం వ్యక్తపరిచిన వాళ్ళను పార్టీనుంచి సస్పెండ్ చేయటం లో కొంత తొందరపాటు వున్దేమోననిపిస్తుంది. మొదట్లో రమణ పత్రికల్లో పార్టీ లైన్ కి భిన్నంగా వ్యాసం రాయటంతో సస్పెండ్ చేయటం జరిగింది. అది సింబాలిక్ గా , మిగతావాళ్లకు హెచ్చరికగా వుండటం కోసంగా చేసారని సర్దిపుచ్చుకోవచ్చు. కానీ అదేపనిగా అందర్నీ సస్పెండ్ చేసుకుంటూ పోకూడదు. ముందుగా వారితో మాట్లాడాలి. మౌఖికంగా హెచ్చరించాలి. ఆ తర్వాతనే తప్పని పరిస్థితుల్లో సస్పెండ్ చేయాలి. ముఖ్యంగా సీనియర్ల విషయం లో , పెద్ద వాళ్ళ విషయం లో కొంత సంయమనం పాటిస్తే బాగుండేది. వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ భావోద్రేకంలో తనకు తాను చెప్పుతో కొట్టుకొని అతిగా ప్రవర్తించి ఉండొచ్చు. కాకపోతే వెంటనే సస్పెండ్ చేయకుండా పిలిచి మాట్లాడి వుంటే బాగుండేది. అతను ఇంటర్వ్యూ చూసిన తర్వాత తను పరిపక్వత వున్న వ్యక్తిలాగా అనిపించింది. అటువంటి వాళ్ళ విషయం లో తొందరపడే  దానికన్నా సంయమనం తో వ్యవహరించాలి. ధృడమైన నిర్ణయాలు తీసుకోవాలి కాకపోతే తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ముఖ్యంగా రాజకీయేతర వ్యక్తుల విషయం లో. ఏది ఏమైనా రాజధాని విషయం లో బిజెపి సెంటర్ స్టేజి లోకి వచ్చింది. రాష్ట్రం లో టిడిపి , వై ఎస్ ఆర్ సి పి నే కాదు మూడో ప్రత్యామ్నాయం కూడా వుందని ప్రజలకు తెలిసేలా వ్యూహాత్మకంగా బిజెపి వ్యవహరించిదనిపిస్తుంది. ఒకవిధంగా సోము వీర్రాజు ప్రో ఆక్టివ్ రాజకీయాలకు ఇది సంకేతమా?

    రాజధాని విషయం లో కిం కర్తవ్యం?

    మూడు రాజధానుల విషయం లో తెగిందాకా లాగటం అనవసరం. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారముందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కోర్టుల్లో దీన్ని లాగిద్దామనుకున్నా అది ఎక్కువకాలం నిలబడదని గుర్తుంచుకోవాలి. సంవత్సరం లోపల మండలి లో కూడా జగన్ పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశముంది. ఒకవేళ ఇప్పటి అసెంబ్లీ నిర్ణయం తప్పని కోర్టులు అభిప్రాయపడినా ( నా దృష్టిలో ఆ అవకాశాలు తక్కువ) వచ్చే సంవత్సరమైనా ఆ నిర్ణయం ఆగదు. అటువంటప్పుడు సాధించేదేమిటి? దానికన్నా రైతుల సమస్యలపై ప్రత్యెక దృష్టి పెడితే మంచిది. రైతులు కూడా రాజధాని విషయం వదిలిపెట్టి తమ ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఏమేమి హక్కులు, సదుపాయాలు కావాలో ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా ప్రభుత్వం, రైతులు భేషిజాలు వదిలి ఓ ఒప్పందానికి రావటం మంచిది. రాజకీయపార్టీలు నిజంగా రైతుల మేలు కోరే వాళ్ళయితే రాజధాని విషయాన్ని పక్కన పెట్టి రైతుల సమస్యపై కార్యాచరణ తో ముందుకెళ్తే ఆచరణ సాధ్యంగా వుంటుంది.