Telangana BJP: తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. తన బలం పెంచుకునేందుకు శాయిశక్తులా పనిచేస్తోంది. రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీ తీరుపై అడుగడుగునా ఎండగడుతున్నారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. పరిపాలన సరిగా లేదని ఎద్దేవా చేస్తున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో విఫలమవుతున్నారని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించడం తథ్యమని జో స్యం చెబుతున్నారు.

ఇప్పటికే జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. తరువాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పార్టీ వెనుకబడిపోయింది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రతో ప్రభుత్వంలో వణుకు పుడుతోందని తెలుస్తోంది. హుస్నాబాద్ లో బండి సంజయ్ ఉద్వేగంతో ప్రసంగించారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ర్టంలో గులాబీ పార్టీ అవినీతి, అక్రమాలపై మాట్లాడారు. ఇంకెన్నాళ్లు వారి ప్రలోభాలకు ప్రజలు గురవుతారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడతారని జోస్యం చెప్పారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు. అధికార పార్టీ ఎంత డబ్బులు పంచినా చివరికి విజయం బీజేపీదేనని దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలన అంతం కావడం ఖాయమేనని చెప్పారు.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ర్టంలో క్రమంగా విస్తరిస్తోంది. అధికార పార్టీని అడ్డుకోవడంలో ముందంజ వేస్తోంది. ఇప్పటికే పలు విధాలుగా టీఆర్ఎస్ పై పదునైన పదజాలంతో విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని మార్గాల్లో ముందుకు రానుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ కి ఎదురుదెబ్బలే తగిలే ప్రమాదం ఉందని తెలుస్తోంది.