భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంతో విరాజిల్లుతోంది. ప్రజల సభకు అంతటి ప్రాధాన్యం ఉంది. కీలకమైన శాసనాల రూపకల్పనలో పార్లమెంటే ప్రజలకు ప్రతినిధిగా మారుతోంది. చట్టాల అమలులో లోక్ సభ పాత్ర అనిర్వచనీయం. ప్రజల రక్షణకే పెద్దపీట వేసే సభల నిర్వహణపై కొన్నాళ్లుగా కొన్ని అభిప్రాయాలు వస్తున్నాయి. లోక్ సభలో సీట్ల సంఖ్య పెంచే విషయమై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ఊహాగానాలు నిజమయ్యేందుకు ప్రభుత్వం సైతం సంకల్పం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం లోక్ సభ సీట్లను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ స్పష్టం చేశారు. దీంతో లోక్ సభ సీట్ల సంఖ్య పెంచే విషయమై బలమైన వాదనలే వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా లోక్ సభ సీట్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా లోక్ సభ సీట్ల సంఖ్య పెంచాల్సి వస్తుందని అందరు ఆకాంక్షిస్తున్నారు.
లోక్ సభ సీట్ల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అది పెద్ద కష్టమైన పని కానేకాదు. దీంతో లోక్ సభ సీట్ల సంఖ్య పెంచేందుకే ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. సీట్ల పెంపు విషయంలో ఏ రాజకీయపార్టీ కూడా అడ్డు చెప్పదనే తెలుస్తోంది. దీంతో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అసమతుల్యత ఏర్పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్ సభ స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన కొత్తేమీ కాదు. ఇది ఎప్పటి నుంచో వస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో ఉన్న స్థానాల సంఖ్య 545. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను తీసేస్తే 543 స్థానాలే మిగులుతాయి. వాటిని వెయ్యికి పెంచాల్సిన అవసరం గుర్తించాలని చెబుతున్నారు. మాజీ రాష్ర్టపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ సైతం లోక్ సభ స్థానాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
అంతేకాదు రాజ్యసభ స్థానాలు పెంచాల్సిన అవసరముందని తెలుస్తోంది. బ్రిటన్ లో 650, కెనడాల 443, అమెరికాలో 535 మంది ఎంపీలున్నప్పుడు మనం కూడా సంఖ్య పెంచుకోవడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. జనాభాలో మన కంటే అన్ని చిన్న దేశాలే. 1977లో మన దేశ జనాభా 55 కోట్లుండగా ప్రస్తుతం 130 కోట్లకు చేరుకోవడం గమనార్హం. దీంతో జనాభా ప్రాతిపదికన చూసినా లోక్ సభ సీట్ల సంఖ్య పెంచడం అవసరమే.