https://oktelugu.com/

Chikoti Praveen: చికోటి చీకటి.. కమలం పార్టీ పెద్దలకు చివరి క్షణంలో తెలిసిందా?

భారత రాష్ట్ర సమితితో పోటా పోటీగా పోరాడిన భారతీయ జనతా పార్టీ నాయకులు కాడి ఎత్తేశారు. రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలోకి పడిపోయారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 13, 2023 / 10:20 AM IST

    Chikoti Praveen

    Follow us on

    Chikoti Praveen: బ్యాండ్ మేళాన్ని మాట్లాడుకున్నారు. అడ్డా కూలీలను వెంట వేసుకొని హంగామాగా బయలుదేరారు. తీరా పార్టీ ఆఫీసులోకి వెళ్లిన తర్వాత అక్కడ ఎవరూ లేరు. దీంతో అతని ముఖం చిన్న పోయింది. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు అతని వద్ద సమాధానం లేక పోయింది. ఏం చెప్పాలో తెలియక.. ముందే ప్లాన్ చేసుకొని వచ్చాను. కానీ ఇక్కడ ఎవరూ లేరు. అది ఒకింత ఇబ్బంది కలిగిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరు ఆయన? ఆ పార్టీ పెద్దలు చివరి క్షణంలో ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? ఇప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏమిటి?

    భారత రాష్ట్ర సమితితో పోటా పోటీగా పోరాడిన భారతీయ జనతా పార్టీ నాయకులు కాడి ఎత్తేశారు. రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలోకి పడిపోయారు.. తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ సాధించింది. ఎన్నికల్లో పోటీకి సై అంటున్నది. లెక్కకు మించిన నాయకులతో భారత రాష్ట్ర సమితికి సవాల్ విసురుతోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీది మాత్రం తెలంగాణలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుతోంది. అందుకే చేరికలకు అడుగడుగునా బ్రేక్ పడుతోంది. ఇటీవల మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు చెన్నమనేని సాగర్ రావు బిజెపిలో చేరుతున్నప్పుడే.. కృష్ణ యాదవ్ చేరిక కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. కృష్ణ యాదవ్ అంతకుముందు చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తో చర్చలు జరిపారు. దీనికి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే సాగర్ రావు చేరిక విషయంలో ఉత్సాహంగా ఉన్న బిజెపి రాష్ట్ర ప్రజలు.. కృష్ణ యాదవ్ విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయారు. దీంతో ఈటెల రాజేందర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఫలితంగా కృష్ణ యాదవ్ చేరిక వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

    తాజాగా చికోటి ప్రవీణ్ వ్యవహారం కూడా కృష్ణ యాదవ్ లాగానే మారింది. కాషాయ కండువా కప్పుకునేందుకు బండి సంజయ్ ద్వారా ప్రవీణ్ మంతనాలు జరిపారు. పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు మంగళవారం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ ఆఫీసు వద్దకు చేరుకోగానే అక్కడ కీలక నేతలు ఎవరూ లేకపోవడంతో చిన్నబుచ్చుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రవీణ్ చేరిక బిజెపి ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. ప్రవీణ్ మీద రకరకాల కేసులు ఉండటం, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తుండడం వల్లే జవదేకర్ ప్రవీణ్ రాక పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. నెల క్రితమే ప్రవీణ్.. బండి సంజయ్ తో పాటు పలువురు కీలక పెద్దలను ఢిల్లీలో కలిసినట్టు ప్రచారం జరుగుతుంది. అవకాశం ఇస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తానని వారిని కోరినట్టు తెలిసింది. అయితే దానికి వారు సమ్మతించడంతోనే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కొంతమంది కీలక నేతలు కూడా ఆయన రాకపట్ల హర్షం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మంగళవారం నాటికి సీన్ మారిపోవడంతో ఒక్కసారిగా ఖిన్నుడవడం ప్రవీణ్ వంతు అయింది. అయితే మంగళవారం రాత్రి ప్రకాష్ జవదేకర్ తో ప్రవీణ్ భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మరి రోజుల్లో ప్రవీణ్ బిజెపిలో చేరుతారని ఆయన వర్గీయులు అంటున్నారు.