
ఇటీవలే తెలంగాణ వర్షాకాల సమావేశాలు అసెంబ్లీలో వాడివేడిగా జరిగాయి. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ సర్కార్ కొత్త రెవిన్యూ యాక్ట్ తీసుకొచ్చి ఆమోదింపజేసింది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు మరోసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ ను ప్రభుత్వం రద్దు చేయాలని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపేరుతో ప్రభుత్వం దోపిడికి పాల్పడుతుంటూ బీజేపీ నేతలు నేడు అన్ని జిల్లాల కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ పిలుపులో భాగంగా నేడు బీజేపీ శ్రేణులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లోకి బీజేపీ నేతలు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు బీజేపీ నేతలకు గాయాలు కాగా.. వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మను పోలీసులు అరెస్టు చేశారు.
జనగామ జిల్లాలోనూ బీజేపీ నిరసన కార్యక్రమం రణరంగంగా మారింది. కలెక్టరేట్ అద్దాలను బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయడంతో పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ నినదిస్తూ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోనూ పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి.
బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఢిల్లీలో ఉన్న సంజయ్ కుమార్ ఈమేరకు ట్వీటర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేడు మోసపూరిత మాటలు మాట్లాడుతుందన్నారు.
కరోనా సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం సామాన్యులపై మరింత భారం మోపుతుందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు.