Kapu Reservations: కాపుల కథ మారుతోంది. అనాదిగా ఏపీలో కమ్మ, రెడ్డి సామాజికవర్గాల కబంధ హస్తల్లో చిక్కి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కాపులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇటీవలే ఏపీ కాపు నేతలు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ లో మీటింగులు పెట్టి కాపుల ఐక్యతను చాటిచెప్పారు. ఒక కొత్త పార్టీ పెట్టడమా? వివిధ పార్టీలోని నేతలంతా ఒక గూటికి చేరడమా? అన్న దిశగా కాపులు కదులుతున్న వేళ తాజాగా బీజేపీ ముందుకొచ్చింది. ఆ పార్టీ కాపుల ఉద్యమాన్ని రగిలించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే కాపుల రిజర్వేషన్లపై గళమెత్తింది.
కాపు రిజర్వేషన్ల పితామహులు సలాది గంగాధర రామారావు తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి రిజర్వేషన్ల పరంగా 30 సంవత్సరాలుగా కాపులకు జరిగిన అన్యాయం గురించి బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవియల్ నరసింహారావుకు వివరించారు. ఈరోజు రాజమహేంద్రవరంలో సోము వీర్రాజు, బీజేపీ నేతల కలిసి వారికి కాపు రిజర్వేషన్ల గురించి తెలియజేశారు.
ఆగష్టు 15 లోపల జగన్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయం తేల్చాలి అని బీజేపీ తరుఫున అల్టీ మేటం జారీ చేశారు జి. వీ. ఎల్. కాపుల రిజర్వేషన్ల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని.. జగన్ సర్కార్ తేల్చేవరకూ వీడేది లేదని తేల్చారు.
వైయస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉండగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న కాపులను కాపు రిజర్వేషన్లను పక్కనబెట్టి 4% రిజర్వేషన్ ముస్లింలకు అమలు చేసి కాపులకు అన్యాయం చేశారని ఈ సందర్భంగా సోము వీర్రాజు సైతం పాత ద్రోహాలను బయటపెట్టారు. ఇప్పుడు ఆయన కుమారుడు కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చారని సోము వీర్రాజు ఆరోపించారు.
కాపు రిజర్వేషన్ల పితామహులు గంగాధర రామారావు కదిలి వచ్చి బీజేపీని కోరడం.. బీజేపీ అంతే ధీటుగా స్పందించడంతో ఈ ఉద్యమం ఏపీని ఊపేయడం ఖాయం. కాపులంతా ఏకమై జగన్ ప్రభుత్వంపై దండెత్తడం ఖాయమంటున్నారు. బీజేపీ కనుక కాపుల రిజర్వేషన్లను టేకప్ చేస్తే ఆ సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.తద్వారా రాజకీయంగా కూడా బీజేపీకి లాభం జరుగుతోంది. కాపులు అనాదిగా ఎదురుచూస్తున్న వారి కోరిక కూడా తీరుతుంది.