Homeజాతీయ వార్తలుBJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక ప్రాతినిధ్యం కలిగి ఉంది. పశ్చిమ భారతదేశం మొత్తం కలిపినా ఇంతకంటే తక్కువ స్థానాలు ఉంటాయి. తూర్పు భారతదేశం సీట్ల సంఖ్యతో యూపీ సమానంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. యోగి ఆదిత్యనాథ్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రయత్నంలో పార్టీ ఇప్పటి నుంచే గ్రాస్‌రూట్స్‌ స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

2024 లోక్‌సభ ఫలితాల నుంచి పాఠాలు
2019లో బీజేపీ యూపీలో 62 సీట్లు గెలవగా, 2024లో కేవలం 33 సీట్లకు పరిమితమైంది. ఈ భారీ పతనం పార్టీని ఆత్మపరిశీలనకు దారితీసింది. 400 సీట్ల టార్గెట్‌ను చేరుకోలేకపోవడం వెనుక యూపీలోని నష్టాలు ప్రధాన కారణం. ఇకపై కులం, మతం ఆధారంగా కాకుండా పనితీరు, పాలనా ఫలితాల ఆధారంగా ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మార్పు యోగి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ధి పనులు, చట్టవ్యవస్థ బలోపేతం వంటి అంశాలను ప్రజల ముందు పెట్టడం ద్వారా విశ్వాసం పెంచే దిశగా ఉంది.

64 స్వింగ్‌ సీట్లపై దృష్టి..
బీజేపీ 18 జిల్లాల్లోని 64 అసెంబ్లీ స్థానాలను ‘స్వింగ్‌ సీట్లు’గా గుర్తించి, వాటిపై ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఇక్కడ 2014, 2019, 2024 ఎన్నికల్లో ఓట్ల శాతం, ఇతర పార్టీల పనితీరు వివరంగా విశ్లేషించబడుతోంది. ఈ సీట్లలో బీజేపీ 10 వేల ఓట్లలోపు మెజారిటీతో ఓడిపోయినట్లు గుర్తించింది. ఇవి త్వరగా తిరిగి సాధించగల స్థానాలుగా భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పంకజ్‌ చౌదరి, సంఘటన మంత్రి ధరమ్‌పాల్‌ సింగ్‌ ఈ 64 సీట్లను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జీలను నియమించి, వారిని ఎన్నికల వరకు అక్కడే ఉంచి క్షేత్రస్థాయి పని చేయించే ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది వనరులను సమర్థవంతంగా వినియోగించి, లక్ష్య సాధనకు సహాయపడే విధానం.

ఇతర రాష్ట్రాల్లో వ్యూహంతో ముందుకు..
హరియాణా, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అమలు చేసిన వ్యూహాల నుంచి యూపీకి పాఠాలు నేర్చుకుంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనలో కూడా బీజేపీ 14 దళాలతో సంస్థాగతంగా బలపడింది. 44 ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లోనూ, మిగతా ప్రాంతాల్లోనూ చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి, వాలంటీర్లను నియమించి గ్రాస్‌రూట్స్‌ స్థాయిలో పని చేసింది. ఇదే తరహా విధానాన్ని యూపీలో కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే యూపీలో 15 వేల గ్రూపులు ఏర్పాటు చేసి, ఒక్కో గ్రూపు రోజుకు 30 సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక వేసింది. ఎన్నికల నాటికి ఐదు లక్షల సమావేశాలు జరిపి, ప్రజాభిప్రాయాన్ని తన వైపుకు మళ్లించాలని లక్ష్యం. ఈ సమావేశాల ద్వారా పార్టీ పాలనా ఫలితాలు, యోగి ప్రభుత్వం చేసిన పనులు నేరుగా ఓటర్లకు చేరవేయడం, అనుమానాలు నివృత్తి చేయడం సాధ్యమవుతుంది.

వ్యక్తిగత సంప్రదింపులు..
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 40 లక్షల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి, వారి సమస్యలు విని, పార్టీ, ఎమ్మెల్యేలపై ఉన్న అసంతప్తిని తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం ప్రచారం కాదు, నిజమైన అభిప్రాయ సేకరణ మరియు సమస్య పరిష్కార విధానం. 64 స్వింగ్‌ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఈ పని మరింత తీవ్రంగా జరగనుంది. ఈ విధానం ద్వారా బీజేపీ ‘పాలనా పనితీరు’ను ప్రధాన అంశంగా ముందుకు తెచ్చి, సాంప్రదాయకంగా జరిగే ఓటు బ్యాంకు రాజకీయాలను అధిగమించాలని చూస్తోంది.

పక్కా వ్యూహంతో..
బీజేపీ వ్యూహం రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి – లక్ష్య సాధన. 64 స్వింగ్‌ సీట్లపై దృష్టి పెట్టడం వల్ల వనరులు వృథా కాకుండా, ఫలితాలు త్వరగా రావచ్చు. రెండు – గ్రాస్‌రూట్స్‌ సంస్థాగతీకరణ. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన మోడల్‌ను అనుసరించడం వల్ల అనుభవం ఉంది. అయితే సవాళ్లు కూడా ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు బీజేపీని ఆపడానికి కలిసి పని చేయవచ్చు. యోగి ప్రభుత్వం చేసిన పనులను ఓటర్లు ఎంతవరకు గుర్తిస్తారు, స్థానిక అసంతృప్తులు ఎంతవరకు తొలగుతాయి అనేది నిజమైన పరీక్ష.

మొత్తంమీద బీజేపీ ఇప్పటి నుంచే సమగ్రమైన, క్షేత్రస్థాయి కేంద్రిత వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2027లో యోగి ఆదిత్యనాథ్‌ మూడోసారి సీఎంగా రావాలంటే ఈ స్వింగ్‌ సీట్లు, గ్రాస్‌రూట్స్‌ కార్యక్రమాలు నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular