Somu Veeraju:నంద్యాల జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్ ‘వైసీపీని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసిరావాలని ’ సంచలన పిలుపునిచ్చారు. పరోక్షంగా టీడీపీ కనుక పొత్తుకోసం వస్తే కలిసి పనిచేస్తామని సంకేతాలు పంపారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో కలిసి వెళుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో టీడీపీని కలుపుకునే చాన్స్ ఉంటుందన్నట్టు చేసిన ప్రకటన సంచలనమైంది. చర్చలకు కూడా సై అంటూ టీడీపీని ఆహ్వానిస్తున్నారు. వైసీపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసి ఒకేవేదికపైకి రావాలని అంటున్నారు. ఆ పొత్తుకు నాయకత్వం వహిస్తామంటున్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధమని ప్రకటించడం సంచలనమైంది.
ఓట్లు చీలిపోతే వైసీపీ గెలుస్తుందని.. అదే జరిగితే ప్రజలు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడుతారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీతో తమకు పొత్తు ఉందని.. అది బలంగా ఉందని తెలిపారు. అయితే టీడీపీని కలుపుకు పోవాలన్న పవన్ కళ్యాణ్ అభిలాషకు ఏపీ బీజేపీ సిద్ధంగా ఉందా? లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న. బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం టీడీపీతో పొత్తుకు అంత సిద్ధంగా లేరు.
కుటుంబ పార్టీ, అవినీతి టీడీపీతో కలిసేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతీసారి చంద్రబాబును దూరం పెడుతున్నారు. చంద్రబాబు త్యాగం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా సోము వీర్రాజు సెటైర్లు వేశారు. చంద్రబాబు త్యాగాలు గమనించడానికి.. నమ్మడానికి ఏపీ బీజేపీ సిద్ధంగా లేదని సోము వీర్రాజు కాస్త గట్టిగానే అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళతామని.. కుటుంబ పార్టీల కోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు భావిస్తున్నారు.
Also Read: Mental Health: మానసిక ఆరోగ్యానికి ఈ నాలుగు అవసరం
పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన ప్రకటన నేపథ్యంలో తాజాగా విజయవాడలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను సంస్కరించలేక అధికారం అనుభవించిన కుటుంబ పార్టీలు చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు నట్టేట ముంచాయని సోము వీర్రాజు ఆరోపించారు.
ఇక టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. అయితే మిత్రపక్షం పవన్ మాత్రం పొత్తులకు సై అంటున్నారు. మరి దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సోము వీర్రాజు లాగానే టీడీపీని దూరం పెడుతుందా? లేక వైసీపీ గెలుపును అడ్డుకునేందుకు జనసేన, టీడీపీతో కలిసి సాగుతుందా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఓవైపు పవన్ పొత్తులకు సై అనడం.. అదే రోజు సోము వీర్రాజు నై అనడం చూస్తుంటే వీరిద్దరి మధ్య కూడా పొత్తులు పొసగడం కొంత కష్టమేనన్న భావన కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
Also Read: Rajya Sabha Seats: రాజ్యసభ స్థానాలకు పార్టీ పల్లకి మోసేవారు వద్దు.. పారిశ్రామికవేత్తలే ముద్దు
Recommended Videos: