BJP-TDP Alliance: ఇన్ సైడ్: “బాబు” ప్రచారం చేస్తే.. మా దారి మేం చూసుకుంటాం: అమిత్ షా కు అల్టిమేటం

తెలంగాణలో బిజెపికి క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే బలం పెరుగుతోంది. అధికార భారత రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రకరకాల కార్యక్రమాలతో హడావిడి చేస్తోంది.

Written By: Bhaskar, Updated On : June 6, 2023 12:00 pm

BJP-TDP Alliance

Follow us on

BJP-TDP Alliance: ఇది నిజంగా భారతీయ జనతా పార్టీకి శరాఘతం లాంటి వార్త. మొన్ననే కదా భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది. బిజెపిలో నెంబర్ 2 అమిత్ షాను కలిసింది. పచ్చ మీడియా మొత్తం డప్పు కొట్టింది. అది అలా జరిగిందో లేదో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నది. చంద్రబాబు ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ క్యాంప్ లో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది.

రావద్దు

2018లో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కూటమిగా ఏర్పడ్డారు. ఓటుకు నోటు కేసు ద్వారా తెలంగాణ ప్రాంతం నుంచి చంద్రబాబును కెసిఆర్ తరిమేసినప్పటికీ.. తెలంగాణలో ఎన్నికల పుణ్యమా అని చంద్రబాబు ప్రచారానికి వచ్చారు. అప్పట్లో చంద్రబాబు ను బూచిగా చూపి కేసిఆర్ సెంటిమెంటును రగిలించారు. రెండవసారి కూడా అధికారంలోకి వచ్చారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి కటీఫ్ చెప్పి బిజెపితో అంట కాగేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షాను కలిశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం అంత సులభం కాదు కాబట్టి.. బిజెపి శరణు జొచ్చారు. ఈ మంతనాలు ఎంత బాగా వచ్చాయో తెలియదు గానీ.. ఆంధ్రప్రదేశ్లో సహకారం అందిస్తే తెలంగాణలో తాము మద్దతు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ వార్త అలా తెలిసిందో లేదో వెంటనే బిజెపి తెలంగాణ నాయకులు అప్రమత్తమయ్యారు.

ప్రచారానికి వద్దు

తెలంగాణలో బిజెపికి క్షేత్రస్థాయిలో ఇప్పుడిప్పుడే బలం పెరుగుతోంది. అధికార భారత రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రకరకాల కార్యక్రమాలతో హడావిడి చేస్తోంది.. దీనికి తోడు ఇతర పార్టీలకు చెందిన నాయకులు చేరడంతో కొంతమేర బలంగా కనిపిస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి పలుమార్లు తెలంగాణకు వచ్చారు. అమిత్ షా కూడా పలమార్లు తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించారు. వీరంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇంత జరుగుతుంటే బిజెపి ఏపీలో తమకు సహకరిస్తే, తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల సమయంలో తాను ప్రచారం చేస్తానని అమిత్ షా కు చంద్రబాబు మాట ఇచ్చారని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన తెలంగాణ బిజెపి నాయకులు చంద్రబాబు పొడను తెలంగాణ మీద, ముఖ్యంగా పార్టీ మీద పడనియొద్దని అమిత్ షాను కోరినట్టు తెలుస్తోంది.

ఎందుకు వద్దంటున్నారు అంటే

తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు రెండు నాలుకల ధోరణి అవలంబించారు. ఆ సమయంలో తెలంగాణ ప్రాంతంలో టిడిపి నాయకులు ఒక్కొక్కరుగా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పటికీ చాలామంది గులాబీ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయింది. పైగా తెలంగాణ ఉద్యమ ద్రోహి అనే పేరు కూడా ఉండటంతో చంద్రబాబు తమకు ప్రచారం చేస్తే దీనిని బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటుందని బిజెపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఇలాంటి సమయంలో చంద్రబాబుతో పొత్తు అంటే కొరివితో తల గోక్కోవడమేనని వారు అంటున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆయన.. ఇప్పుడు బిజెపి పంచన చేరడం వెనుక ప్రయోజనం ఏమిటో అందరికీ తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ఎలాంటి విమర్శలు చేశారో ఉటంకిస్తున్నారు. ఆంధ్ర విషయం పక్కన పెడితే తెలంగాణలో పార్టీకి విస్తృత అవకాశాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబును బలవంతంగా తమ మీద రుద్ద వద్దని తెలంగాణ ప్రాంత నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ.. తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు తమ తరఫున ప్రచారం చేస్తే మా దారిలో మేము వెళ్ళిపోతామని బిజెపి నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది.